ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్..?



 

బహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉండేలా దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యమైనా సరే అభిమానుల అంచనాలు అందుకునేలా రూపొందిస్తున్నారు. దీంతో ఆయన అభిమానులకు తాము ఆరాధించే హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూడక తప్పడం లేదు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన నటిస్తున్న ఆదిపురుష్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. తాజాగా దీని ప్రభావం మరో పాన్‌ ఇండియా చిత్రం సలార్ పై పడనున్నట్లు తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా… జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు దర్శకుడు ఓంరౌత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదల కాగా.. చాలా మందిని నిరాశ పరచడంతో సినిమాను మంచిగా తీర్చిదిద్దడం కోసం మరికొంత సమయం తీసుకోనున్నారు. అయితే సలార్‌ చిత్రం కూడా వాయిదా పడనుందనే వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని చిత్రబృందం గతంలో ప్రకటించింది. ఆదిపురుష్‌ వాయిదా పడడంతో ఆ ప్రభావం సలార్‌ పై పడనుందని.. దీంతో ఈ సినిమాను కూడా వాయిదా వేసే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్ టాక్‌. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకున్నావాయిదా పడటం దాదాపు ఖరారే. దీంతో ప్రభాస్ అభిమానులకు మరిన్ని రోజులు ఎదురుచూపులు తప్పేలా లేవు.