సూపర్‌స్టార్.. సాధారణంగా ఈ బిరుదు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలకు మాత్రమే ఉంటుంది. ప్రాధాన్యం, పారితోషికం, పాత్రలు ఇలా ప్రతిదాంట్లో హీరోలకే ప్రాముఖ్యత ఎక్కువ. అలాంటి మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక మామూలు మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్డమ్ కథానాయకులకే కాదు నాయికలకూ ఉంటుందని నిరూపించింది. ప్రాధాన్యతలో, పారితోషికంలో, నటనలో మగవాళ్లకు ఏ మాత్రం ఆడవాళ్లు తీసిపోరని బల్లగుద్ది చెప్పింది. హీరోలకు మాత్రమే జేజేలు కొట్టేవాళ్లతో కూడా లేడీ సూపర్‌స్టార్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగింది. ఆమే లేడీ సూపర్‌స్టార్ నయనతార.
రెండు దశాబ్ధాల క్రితం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఇప్పటి వరకూ కొనసాగుతోంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది అంటారు.. కానీ ఆ ముద్రను కూడా చెరిపేసి 20 ఏళ్లుగా తన సినీ ప్రయాణం కొనసాగిస్తోంది. 2003లో ఓ మలయాళ సినిమాతో అరంగేట్రం చేసిన నయన్.. 2006లో టాలీవుడ్లో వెంకటేశ్ సరసన నటించిన లక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఎంట్రీయే స్టార్ హీరోతో చేసిన నయన్ ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. వరుస బ్లాక్బస్టర్లు.. స్టార్ హీరోలతో కలిసి నటించింది. తమిళ, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది. రెమ్యునరేషన్ విషయంలో హీరోలు, హీరోయిన్లకు తారతమ్యాలు చూయించడం నచ్చని నయన్.. తన పాత్రకు తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వకపోతే ఆ సినిమాలకు నో చెప్పేది. ఇలా పలు మూవీస్ తన చేతిలో నుంచి జారిపోయినా మాట మీదే నిలబడుతూ వచ్చింది.
ఇక తమిళ్ మూవీ నేనూ రౌడీనే సినిమా దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడింది నయనతార. కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఈ జంట ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తాము తల్లిదండ్రులమయ్యామని ఈ జంట షాక్ ఇచ్చింది. సరోగసీ విధానంలో పిల్లల్ని కన్నామని చెప్పింది. ఈ క్రమంలోనే వివాదంలో చిక్కుకున్న ఈ లవ్ కపుల్.. ఐదేళ్ల క్రితమే తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు.
గత కొద్ది కాలంగా వివాదాలతో సావాసం చేస్తోంది నయనతార. ఒక సమస్య పోతే మరో సమస్యలో చిక్కుకుంటోంది. ఇప్పుడు పిల్లలు కూడా పుట్టడంతో ఈ చికాకులన్నీ లేకుండా హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటుందట ఈ బ్యూటీ. అందుకే కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే చిరంజీవి గాడ్‌ఫాదర్ మూవీతో అలరించిన నయనతార ప్రస్తుతం.. షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇది పూర్తైన తర్వాత నయనతార మాధవన్ హీరోగా నటిస్తున్న ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త దర్శకుడు శశికాంత్ రూపొందిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ తర్వాత ఇక నయన్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలనుకుంటుందట. అందుకే ఇక ఏ సినిమాలు, ఎండార్స్మెంట్స్ ఒప్పుకోవద్దనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.