భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోనున్నారు.. త్వరలోనే విడాకుల ప్రకటన చేయబోతున్నారు.. ఇవీ ఇటీవల నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. ఈ దంపతుల సన్నిహితులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకుని విడాకుల ప్రకటన చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి.
కానీ ఇప్పుడవన్నీ కేవలం ఊహాగానాలేనా? అనే సందేహం కలుగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఉర్దూ ఓటీటీ వేదిక ఉర్దూఫ్లిక్స్ కోసం ఈ జోడీ కలిసి ‘ది మీర్జా మాలిక్ షో’ పేరుతో టాక్ షో చేస్తుండడమే అందుకు కారణం. త్వరలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని ఉర్దూఫ్లిక్స్ ప్రకటించింది. అంతే కాకుండా షోయబ్ భుజం మీద సానియా చేయి వేసి దిగిన ఫొటోనూ పోస్టు చేసింది. దీంతో ఈ జంటపై నెటిజన్లు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
సానియా, షోయబ్ దంపతులు కేవలం ప్రచారం కోసమే విడాకుల నాటకాలాడుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ షూటింగ్ గతంలోనే జరిగి ఉంటుందని, ప్రసారానికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే విడాకుల ప్రకటన వాయిదా వేసి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రసారం తర్వాత వీళ్లు విడాకులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని మరికొంతమంది అంటున్నారు.
మరోవైపు షోయెబ్-సానియా విడాకుల పుకార్ల వేళ.. షోయబ్ మాలిక్ గతేడాది ఓ మ్యాగజైన్ కోసం పాక్ మోడల్ అయేషా ఓమర్తో కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఆయేషా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో షోయబ్, అయేషాలు చాలా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని చూసిన సానియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదే సమయంలో సానియా కూడా మనసు ముక్కలైందంటూ వరుస పోస్టులు చేసింది. ఆ ఫొటోల వల్లే సానియా, షోయబ్‌లు విడిపోతున్నారంటూ ఊహాగానాలు తెగ షికారు చేస్తున్నాయి.
ఇప్పటికీ ఇన్‌స్టాలో షోయెబ్ మాలిక్‌ను సానియా మీర్జా ఫాలో అవుతోంది. కానీ ఇటీవల సానియా పెట్టిన పోస్టులు మాత్రం విడాకుల వార్తలను నిజం చేసేలాగే ఉన్నాయి. దీనికి మరింత బలం చేకూర్చేటట్లు మరో విషయం బయటకు వచ్చింది. సానియా, మాలిక్ దుబాయ్‌లోని పామ్ జుమేరియాలోని ఓ విల్లాలో ఉండేవారట. ప్రస్తుతం సానియా అక్కడి నుంచి వేరే అపార్ట్‌మెంట్‌కు వెళ్లినట్లు సమాచారం.
షోయబ్ మాలిక్ ఇటీవల సానియా గురించి ఓ క్రికెట్ షోలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సానియా టెన్నిస్ అకాడమీల లొకేషన్ గురించి అడిగితే అంతగా తెలియదని సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ఆ షో వ్యాఖ్యాతలను ఆశ్చర్యపరచింది. 2010లో వివాహ బంధంతో ఒక్కటైన సానియా, మాలిక్.. అప్పటి నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు. జనవరిలో తాను టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సానియా ప్రకటించింది.