Pathan Collection : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. బీ టౌన్ దివా దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పఠాన్. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ తెరపై సందడి చేశాడు. ఐదేళ్ల ముందు కూడా షారుక్‌కు వరుస పరాజయాలే. ఓ సరైన హిట్ కోసం షారుక్ దాదాపు ఓ దశాబ్ధం నుంచి ఎదురుచూస్తున్నట్టే లెక్క. ఇన్నేళ్ల నిరీక్షణ.. ఇన్నాళ్ల కఠోర శ్రమ ఫలించింది. ఎట్టకేలకు పఠాన్ రిలీజ్ అయింది.
రిలీజ్ అంటే మామూలు రిలీజ్ కాదండోయ్. బ్లాక్‌బస్టర్ రిలీజ్.. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కింగ్ ఖాన్‌ను కాస్త కలెక్షన్ కింగ్ చేసేసింది పఠాన్ మూవీ. ఐదేళ్ల తర్వాత షారుక్‌ను తెరపై చూస్తున్న ప్రేక్షకులకు ఓ మైకంలో మునిగిపోతున్నారు. అందులోనూ సూపర్ పవర్ఫుల్ యాక్షన్ మోడ్‌లో షారుక్‌ను చూసి ఫిదా అవుతున్నారు. ఇక అమ్మాయిలైతే షారుక్ బాడీని చూసి మనసిచ్చేస్తున్నారు.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల విషయంలో తొలి రోజు నుంచే దూకుడు ప్రదర్శిస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశవ్యాప్తంగా రూ.120కోట్లను అందుకుంది. కేజీయఫ్ సినిమా ఫస్ట్ డై కలెక్షన్లు బ్రేక్ చేయాలంటే దానిని మించిన సినిమా రావడానికి ఏళ్లు పడుతుందని అందరూ భావించారు. కానీ బాద్షా ఇలా బాక్సాఫీస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అలా చాలా ఈజీగా కేజీయఫ్ కలెక్షన్లను బ్రేక్ చేసేశాడు.
పఠాన్ మూవీకి వస్తోన్న క్రేజీ రెస్పాన్స్.. అంతకుమించి వస్తోన్న క్రేజీ కలెక్షన్స్‌ను చూసి షారుక్ తెగ సంబురపడిపోతున్నాడు. ఈ క్రమంలో ఈ కింగ్ ఖాన్ ట్వీట్ చేశాడు. ‘వెనక్కి తిరిగివెళ్లడానికి నా దగ్గర ఏమీ లేవు. ఎప్పుడూ ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. జీవితం చాలా చిన్నది. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి. ఓ 57ఏళ్ల వ్యక్తి సలహా ఇది’ అంటూ ట్వీట్ చేశాడు.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన పఠాన్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇండియన్ రా ఏజెంట్‌గా షారుక్ ఖాన్ కనిపించారు. ఇక ఐఎస్ఐ ఏజెంట్ పాత్రలో దీపికా పడుకొణె నటించారు. బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించి సినిమాకే హైలైట్‌గా నిలిచారు. భారతదేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను పఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. కథ కన్నా యాక్షన్ అంశాలకే అధికంగా ప్రాముఖ్యతనిస్తూ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇదిలా వుంటే ‘పఠాన్’ బ్లాక్ బస్టర్ హిట్‌తో మల్టీవర్స్ మూవీస్‌కు మరింత ఊతం లభించినట్టనిపిస్తోంది. మల్టీవర్స్‌లో భాగంగానే ఇందులో సల్మాన్ ఖాన్ టైగర్‌గా కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ స్ఫూర్తితో మరిన్ని మల్టీవర్స్ నేపథ్య సినిమాలు తెరపైకి రావడం ఖాయంగా కనిపిస్తోందిని ఇన్ సైడ్ టాక్.
మరోవైపు ‘పఠాన్‘ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. దక్షిణాది దర్శకుల్లా బాలీవుడ్ వాళ్లు కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించలేరనే అపోహను ఈ సినిమా పటాపంచలు చేసిందని ఆయన అన్నారు. ఈ మేరకు’పఠాన్’ టీమ్‌ను మెచ్చుకుంటూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు.
“1. ఓటీటీ వృద్ధి చెందుతోన్న ఈరోజుల్లో థియేటర్ కలెక్షన్స్ మళ్లీ మెరుగుపడవు. 2. షారుఖ్ కెరీర్ అయిపోయింది. 3. దక్షిణాది దర్శకులు తెరకెక్కించిన విధంగా బాలీవుడ్ వాళ్లు కమర్షియల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించలేరు. 4. ‘కేజీయఫ్-2’ తొలిరోజు కలెక్షన్స్‌ను బ్రేక్ చేయడానికి కొన్నేళ్లు సమయం పడుతుంది. అయితే.. పైన పేర్కొన్న అపోహలన్నింటినీ ‘పఠాన్’ పటాపంచలు చేసింది” అని వర్మ తెలిపారు.