Thalaivar 171 Title : లోకేశ్ కనగరాజ్.. కోలీవుడ్ లో ఇప్పుడు సూపర్ బిజీ డైరెక్టర్. ప్రముఖ స్టార్ హీరోలంతా ఇతడితో సినిమాలు చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే లోకేశ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఇటీవలే లియోతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్.. తాజాగా తలైవా, సూపర్ స్టార్ రజనీ కాంత్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

రజనీ 171వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి పలు రాకల టైటిళ్లు ప్రచారంలో ఉండేవి. రాణా, తంగమ్ అని పలు పేర్లు నెట్టింట వైరల్ అయినా.. ఇవి ఏవీ కాకుండా తాజాగా టైటిల్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు ఎవరూ ఊహించనట్లు కూలీ అనే పేరును ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ పేరు ఇప్పటికే పలు సినిమాలకు ఉంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూలీ పేరుతో ఓ సినిమాలో నటించారు. ఇటీవలే వరుణ్ ధావన్ కూడా కూలీ పేరుతో ఓ చిత్రం చేశాడు. ఇక టాలీవుడ్ లో వెంకటేశ్ కూడా కూలీ నంబర్ 1 పేరుతో ఓ సినమాలో నటించాడు. అయితే ఈ పేరుతో ఉన్న ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇక తలైవా కూలీ మూవీ ఈ గ్లింప్స్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో అదిరింది. సాధారణంగా లోకేశ్ సినిమా అనగానే యాక్షన్ కామన్. ఈ చిత్రంలో ఆ యాక్షన్ కు తోడు తలైవా స్టైల్ కూడా యాడ్ అయింది. ఇంకేం టైటిల్ టీజరే ప్రేక్షకుల్లో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేసేసింది. ఎప్పటిలాగే ఈ గ్లింప్స్ లో రజనీ స్టైల్, యాటిట్యూడ్ ఫైటింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్నట్లు అనిపిస్తోంది.
కోలీవుడ్లో ఖైదీ, విక్రమ్, లియో వంటి బ్లాక్ బస్టర్లతో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనగరాజ్. అయితే లియో విషయంలో మాత్రం కొంత నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే ఈసారి రజనీ మూవీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రజనీ కాంత్ ను మునుపెన్నడూ చూడని అవతారంలో చూస్తామని లోకేశ్ ఇంతకు ముందు చెప్పాడు. తన గత సినిమాల్లో లాగా ఈ చిత్రంలో డ్రగ్స్ వినియోగం వంటి సీన్లు ఉండవని ముందే చెప్పేశాడు.
మరోవైపు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో రజనీ కాంత్ తో పాటు మరో స్టార్ హీరో నటించనున్నాడట. ఆయనెవరో కాదు మన టాలీవుడ్ కింగ్ నాగార్జున. ఈ ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ గా ఈ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఇంకో సర్ ప్రైజ్ ఏంటంటే.. ఈ మూవీలో రజనీకాంత్ కూతురు పాత్ర కోసం శ్రుతిహాసన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు విషయాలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా చూడటానికి మరో రెండు కారణాలు ప్రేక్షకులకు దొరికేసినట్టే.