Veera Simha Reddy : సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లో ప్రభంజనం సృష్టించింది నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని గోపిచంద్ మలినేని తెరకెక్కించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. ఫ్యాక్షన్-చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య నటనకు మరోసారి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. బాలకృష్ణ మరోసారి సంక్రాంతి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
రిలీజ్ అయిన పది రోజుల్లోనే వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా విజయోత్సవ వేడుకలను ‘వీరమాస్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఆదివారం రోజున హైదరాబాద్‌లో నిర్వహించారు. యువ కథానాయకులు విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డతోపాటు దర్శకులు హరీష్‌శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ తదితరులు హాజరయ్యారు. ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్లో పాట పాడి అభిమానులను అలరించారు బాలకృష్ణ.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సక్సెస్ మీట్లో ‘మాతో పెట్టుకోకు’ సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా’ అనే పాటను స్టేజ్‌పై సింగర్‌తో కలిసి పాడారు బాలకృష్ణ. ఈ పాట బాలయ్య పాడాలని సింగర్స్ కోరడంతో స్టేజ్‌పైకి ఆయన వచ్చారు. వారితో కలిసి పాటను పాడి అభిమానులను అలరించారు. బాలకృష్ణ పాట పాడిన వీడియోను వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
గతంలో ‘మేముసైతం’ ఈవెంట్లో ‘లెజండ్’ సినిమాలోని ‘నీ కంటి చూపుల్లో’ అనే పాటను బాలకృష్ణ ఆలపించారు. తన పుట్టినరోజు సందర్భంగా గతంలో ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’ సినిమాలోని ‘శివ శంకరి’ ఆనే పాటను స్వయంగా పాడి రిలీజ్ చేశారు.
అన్నాచెల్లెలి సెంటిమెంట్‌కు రాయలసీమ నేపథ్యాన్ని జోడించి దర్శకుడు గోపీచంద్ మలినేని.. ‘వీరసింహారెడ్డి’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించారు. బాలకృష్ణ సోదరిగా వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో కనిపించారు. దునియా విజయ్, హనీరోజ్ కీలక పాత్రలు పోషించారు.
ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నటుడిగా భిన్న రకాల పాత్రలు చేసే అవకాశం లభించిందంటే అది ఈ జన్మకి నాకు లభించిన అదృష్టం. ఇంకా కుర్రాడిలా కనిపించడం వెనక అదే రహస్యం’’ అన్నారు.
‘ఒక్కొక్కసారి ఒక్క డైలాగ్ నుంచి, ఒక్క మేనరిజమ్ నుంచే కథ పుడుతుంటుంది. దీనికి ఆద్యుడు మా బోయపాటి శ్రీను. గోపీచంద్ మలినేని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడే సీమ రక్తం కుతకుతలాడుతోందని అన్నా. నా అభిమాని కాబట్టి గోపీచంద్ మలినేని వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’ అన్నాడు.
ఫ్యాక్షన్ నేపథ్యంలో అద్భుతమైన కథ చేశాడు. ఇది కథ కూడా కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకి చెందిన అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. మాటల్లోనూ, పాటల్లోనూ అద్భుతమైన పనితీరు కనబరిచారు సాయిమాధవ్ బుర్రా, రామజోగయ్యశాస్త్రి. తమన్ సంగీతం అద్భుతంగా ఉంది. ఒకొక్క పాట నా ఆహార్యానికి సరిపడేలా ఉంటుంది. ఇదొక విస్ఫోటనం అని చెప్పా. అన్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది’’ బాలయ్య బాబు అన్నారు.