ఒకప్పటి దేశీ గర్ల్.. ఇప్పటి గ్లోబల్ స్టార్.. ఎప్పటికీ బాలీవుడ్ స్టార్.. ప్రియాంకా చోప్రా. ఓవైపు హాలీవుడ్లో ఫుల్ బిజీగా నటిస్తూ.. మరోవైపు బిజినెస్ చేస్తూ.. ఇంకోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే మూడేళ్ల తర్వాత ఈ భామ ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే ప్రియాంకపై మాజీ మిస్ బార్డోస్ లెయ్‌లానీ మెకనీ తీవ్ర ఆరోపణలు చేసింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని ప్రియాంక చోప్రా.. రిగ్గింగ్ చేసి సొంతం చేసుకుందని మెకనీ ఆరోపించింది. ఆనాటి ప్రపంచ సుందరి పోటీల గురించి వివరిస్తూ లెయ్‌లానీ వీడియో షేర్ చేసింది.
‘‘మిస్ బార్బడోస్‌గా నేను 2000లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నాను. ఆ ఏడాది మిస్ ఇండియా (ప్రియాంక చోప్రా) ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1999, 2000.. ఇలా రెండేళ్ల పాటు ప్రపంచ సుందరి కిరీటం భారతదేశానికే దక్కడానికి స్పాన్సర్లే కారణం. ఎందుకంటే ఆ సంస్థ ఇండియాకు చెందినది. ముఖ్యంగా ప్రియాంకకు అక్రమంగా కిరీటం వరించింది. ఆమె అందగత్తె కాదు. రిహార్సల్స్‌లోనూ పాల్గొనలేదు. మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆమె రూమ్‌కే వెళ్లేది. కానీ మిగిలిన వాళ్లందరికీ, అలా కాదు. ఆమెకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేశారు. బీచ్లోనూ ఆమెకు స్పెషల్‌గా ఫొటోలు తీసి పేపర్లలో వచ్చేలా చేశారు. మిగిలిన వాళ్లందరినీ గుంపుగా తీశారు. ఇలా ఆ ఏడాది ప్రపంచ సుందరి పోటీల్లో ఫేవరెటిజం ప్రదర్శించారు’’ అని ఆరోపణలు చేసింది మెకనీ.
మిస్ యూఎస్ఏ పోటీలకు సంబంధించిన వివాదం గురించి మాట్లాడుతూ లెయ్‌లానీ తాజాగా ఈ వీడియో షేర్ చేసింది. స్పాన్సర్ వల్లే మిస్ టెక్సాస్ ఆర్బానీ గాబ్రియేల్‌కు మిస్ యూఎస్ఏ కిరీటం వచ్చిందంటూ పోటీల్లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లెయ్‌లానీ.. 2000 ప్రపంచ సుందరి పోటీల్లోనూ ఇలాగే జరిగిందంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని ప్రియాంకపై ఆరోపణలు చేసింది.
మెకనీ ఆరోపణలపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. మా దేశీగర్ల్ అలాంటి పనులు చేయదని కొందరు అంటుంటే.. అప్పుడే అనుకున్నాం ఇదేదో జరిగే ఉంటుందని అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.