Pawan Kalyan : చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ షురూ చేసి నెమ్మదిగా కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎదిగారు అలీ. ఓవైపు వెండితెరపై తన హవా కొనసాగిస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలీతో జాలీగా, అలీతో సరదాగా అంటూ ప్రత్యేక షోలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమం 300 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈ షోకు కొన్నాళ్లు గ్యాప్ ఇవ్వబోతున్నారట.
అందుకే తన షోలో తానే గెస్టుగా వచ్చారు ఆలీ. ఇన్నాళ్లూ గెస్టులను అలరించిన ఆలీని ఈ ఎపిసోడ్లో యాంకర్ సుమ రఫ్ఫాడించేసింది. ఆలీకి సంబంధించిన వ్యక్తిగత, ఫ్యామిలీ, వివాదాలు అన్నింటి గురించి అడిగేసింది. ఆలీ నుంచి చాలా విషయాలే రాబట్టింది. వీటిలో పవన్ కల్యాణ్-ఆలీ మధ్య వివాదం గురించి కూడా ఉంది.
అయితే తనకు పవన్ కల్యాణ్‌కు గొడవ జరిగిందంటూ వచ్చిన వార్తలపై ఈ షోలో ఆలీ స్పందించారు. స్పందించడమే కాదు ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. అసలు పవర్ స్టార్‌తో తనకు గొడవ ఎక్కడ మొదలైందో కూడా చెప్పేశారు. మరి ఆ సంగతేంటో ఓసారి తెలుసుకుందామా..?
“పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇద్దరి మధ్య అసలు గొడవ ఎక్కడ మొదలైందో తెలుసా. సోషల్ మీడియాలో. అదేనండి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాయడం అలవాటైంది కదా కొందరికి. అలా వారు వండిన పాకమే మా ఇద్దరి మధ్య గొడవ అన్నమాట. నాకూ పవన్‌కల్యాణ్ కు మధ్య గ్యాప్ లేదు. కొందరు వెబ్‌సైట్స్ వాళ్లు దాన్ని క్రియేట్ చేశారు. ఇటీవల మా పాప పెళ్లికి పిలవడానికి ఆయన నటిస్తున్న సినిమా సెట్‌కు వెళ్లా. విషయం తెలిసి.. ఆయన నా దగ్గరకు వచ్చారు.
అదే సమయంలో వేరే వాళ్లు వస్తే, వాళ్లను వెయిట్ చేయమని చెప్పారు. ఆయన తొలుత నా దగ్గరకు వచ్చారు. మేము 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ విషయం వేరే వాళ్లకు, వెబ్‌సైట్స్‌లో రాసే వారికి తెలియదు. ఏదో రాస్తే, అందరూ ఆసక్తిగా చూస్తారని అనుకుంటారు. ఏమీ ఉండదు అక్కడ. పెళ్లికి వస్తానని పవన్ చెప్పారు కూడా. అయితే, ఆయన ఎక్కాల్సిన విమానం మిస్సవడంతో రాలేకపోయారు. దీంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాశారు. అంతేకానీ, మా మధ్య గ్యాప్ ఏమీ లేదు.” అని ఆలీ అసలు సంగతి చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఆలీ ఈ షోలో చాలా విషయాలు పంచుకున్నారు. తన 40 ఏళ్ల సినీ కెరీర్లో ఏవైనా కష్టాలు చూశారా అని సుమ అడిగిన ప్రశ్నకు ఆలీ సమాధానం ఇచ్చారు. “ఆరేళ్లపాటు ఒక పూట భోజనం చేసి బతికా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి అవకాశాలే వచ్చాయి. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఏడాదికి ఒకట్రెండు సినిమాలే వచ్చేవి.
మెస్‌కార్డు కొనాలంటే రూ.75. ఆ డబ్బులు లేక ఒక పూటే తినేవాడిని. సాయం అడిగితే ఎవరికైనా చెబుతారని భయపడేవాడిని. 1984 నుంచి 90 దాకా చాలా తక్కువ సినిమాలు చేశా. అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో మా రూమ్మేట్స్ బట్టలు ఉతికేవాడిని. నా అద్దె కూడా వాళ్లే కట్టేవాళ్లు. వంట కూడా చేసేవాడిని. 1991 నుంచి మళ్లీ కెరీర్ ఊపందుకుంది.” అని చెప్పారు ఆలీ.