పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ భారీ అంచనాల నడుమ 2023 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన మూవీ రెండు ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా కొందరు సినీ ప్రముఖులు భారీ ఎత్తున టికెట్స్ కొనుగోలు చేసి సినిమాపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టికెట్స్ను ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. ఇక ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాళీ సీటు పక్కన ఉండే సీటు టికెట్కు సంబంధించి రకరకాల రూమర్స్ మొదలయ్యాయి.
రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు వస్తాడు అనే నమ్మకంతో.. ప్రతి థియేటర్లో ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నారు చిత్ర బృందం. అయితే హనుమంతుడి సీటు పక్కన సీట్లకు టికెట్ ధర ఎక్కువ కేటాయిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇరువైపులా సీట్లకు ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో, వాళ్లకే ఆ సీట్లు దక్కుతాయన్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ వార్తలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఇలాంటి తప్పుడు వార్తల్ని ఎవ్వరూ నమ్మొద్దు జై శ్రీరామ్ అంటూ టీ సిరీస్ సంస్థ ట్వీట్ చేసింది.
ఇక అత్యంత భారీ బడ్జెత్తో రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదల కానుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడు/లంకేశ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రభాస్ అభిమానులతో పాటు రాముడి కథని చూడాలనుకుంటున్న ప్రతి ఒక్కరు టికెట్స్ ని బుక్ చేసేసుకుంటున్నారు.