సినిమా ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో డైరెక్టర్ తేజ ఫస్ట్ ప్లేసులో ఉంటారు. ఏ విషయమైన ముక్కు సూటిగా చెప్పడం.. మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం తేజ స్టైల్. తన ముక్కు సూటితనం వల్ల తేజ చాలా వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. తేజ తనకు తెలియని విషయాల జోలికి వెళ్లడు.. కానీ తెలిసిన విషయాన్ని మాత్రం నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఇతరుల విషయంలోనే కాదు.. తనకు సంబంధించిన విషయాల్లో కూడా తేజ చాలా ఓపెన్‌గా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. యంగ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ చావుకు కారణమేంటో తనకు తెలుసని చెప్పారు.
తేజ దర్శకత్వం వహించిన ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఉదయ్ కిరణ్. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఉదయ్‌కి అవకాశాలు వరుసకట్టాయి. చిత్రం తర్వాత ‘నువ్వు నేను’ అంతకుమించి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ‘మనసంతా నువ్వే’ కూడా సూపర్ హిట్ అయింది. ఈ రోజుకీ ఆ సినిమా టీవీలో వస్తే కుటుంబమంతా కలిసి కూర్చొని హాయిగా చూస్తారు. చాలా మంది యువత యూట్యూబ్ లో పెట్టుకుని మరీ ఈ మూవీ చూస్తుంటారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా స్టార్ గా మారాడు. కానీ ఆ స్టార్ డమ్ ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు.
వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఒక్క హిట్ కూడా లేకపోవడం.. కొన్ని పర్సనల్ సమస్యల వల్ల ఉదయ్ కిరణ్ నెమ్మదిగా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. 2014 జనవరి లో ఉదయ్ కిరణ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై మీడియాలో రకరకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం తనుకు తెలుసని, చనిపోయేలోపు ఆ విషయాలు చెబుతానని అన్నారు. “ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడు. వరుసగా మూడు హిట్ లు వచ్చేటప్పటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. స్టార్‌డమ్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ మిస్ కావడం కామన్. నేను దాన్ని తల పొగరు అనుకోలేదు. అమాయకత్వం అనుకున్నా. తను ప్లాప్‌లతో సతమతమవుతున్న సమయంలో పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ లో అవకాశం ఇచ్చా.
ఆ సినిమా షూటింగ్ సమయంలో విచారం వ్యక్తం చేశాడు. ‘మీ విషయంలో నేను కాస్త పొగరుగా వ్యవహరించినా.. గుర్తుపెట్టుకొని మరీ సినిమా అవకాశం ఇచ్చారు. మీ పాదాలు తాకుతా.. క్షమించానని ఒక్కసారి చెప్పండి చాలు అన్నాడు. నేను అవేవి వద్దని చెప్పా. అతని జీవితంలో ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. నాకు అన్ని విషయాలు చెప్పాడు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణాలు సమయం వచ్చినప్పుడు బయటపెడతా. నేను చనిపోయేలోపు ఈ విషయాలను వెల్లడిస్తా. ఇప్పుడు చెప్పడం సరైన పద్దతి కాదు” అని తేజ చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ తేజ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య టాపిక్ చర్చనీయాంశమైంది. అతడి చావుకు కారణమేంటో చెప్పేయండి తేజ గారు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తేజని రిక్వెస్ట్ చేస్తున్నారు.