Yatra 2 Review : సెంటిమెంట్ తో గుండెల్ని పిండేసిన డైరెక్టర్

- Advertisement -

Yatra 2 Review : 2019 వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన యాత్ర సినిమా పెద్ద హిట్టైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి కొనసాగింపుగా ఆయన తనయుడు జగన్ బయోపిక్ గా యాత్ర 2 తీస్తానని ఆ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ అప్పట్లోనే ప్రకటించాడు. కానీ ఆ చిత్రాన్ని 2024 ఎన్నికల సమయం లో విడుదల చేసే ఉద్దేశ్యంతో గత ఏడాది షూటింగ్ ప్రారంభించి పూర్తి చేసాడు.

ఈ సినిమాలో జగన్ పాత్రని తమిళ హీరో జీవా పోషించగా, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రని మలయాళం మెగాస్టార్ మమ్ముటి పోషించాడు. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రతీ ఒక్కటి కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. మరి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

కథ :

- Advertisement -

మొదటి భాగం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పోరాటం ని చూపిస్తూ ఆయన చివర్లో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది చూపిస్తారు. ఆ తర్వాత యాత్ర 2 లో కొనసాగింపుగా మొదటి టర్మ్ లో సీఎం రాజశేఖర్ రెడ్డి ఎంతో గొప్పగా పరిపాలించాడు. రెండవ టర్మ్ లో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోవడం, ఆ వార్త విని రాష్ట్రం లో ఎన్నో వేలమంది అభిమానులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి సీఎం జగన్ ‘ఓదార్పు యాత్ర’ చెయ్యడం, దానిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చెయ్యడం వంటి ఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ మహి వి రాఘవ్.

ఆ తర్వాత సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఓదార్పు యాత్ర’ చేసిన జగన్ పై సోనియా గాంధీ అక్రమంగా కేసులు పెట్టి జగన్ ని జైలుపాలు చెయ్యడం, ఆ తర్వాత మొదటి దఫా ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడం, జగన్ ఎన్నో సవాళ్ళను ఎగురుకుంటూ పాదయాత్ర చేసి అఖండ మెజారిటీ తో ముఖ్యమంత్రి అయిన సంఘటనలు వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

సీఎం జగన్ జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిది.ఆయన రాజకీయ ప్రయాణం ఎలాంటిదో మన కళ్లారా చూసాము. వివిధ ఎమోషన్స్ తో ఒక రోల్లర్ కోస్టర్ లాగ ఉంటుంది జగన్ జీవితం. ఆయన కథ ని వెండితెర మీద ఆవిష్కరించాలి అనుకోవడం డైరెక్టర్ మహి వి రాఘవ్ కి పెద్ద సవాలే. కానీ ఆయన సవాలు ని స్వీకరించి ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.సినిమాని చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు తన దృష్టిని వేరే వాటిపై మరలించడు.

అంతటి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని పరుగులు తీయించాడు ఆయన. కొన్ని సన్నివేశాలను చూస్తే కేవలం వైసీపీ అభిమానులకు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుడికి కూడా కన్నీళ్లు వచ్చేస్తాయి. అంతటి ఎమోషన్ ని పండించాడు డైరెక్టర్. డైలాగ్స్ ఒక్కొక్కటి తూటాలు లాగా పేలాయి. ప్రేక్షకులు కలకాలం గుర్తించుకునే డైలాగ్స్ ని ఈ సినిమా లో పెట్టాడు డైరెక్టర్.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో జగన్ పాత్రధారి జీవా నటించలేదు, జీవించాడనే చెప్పాలి. అంత చక్కగా నటించాడాయన. జగన్ మాట్లాడే తీరు, నడిచే విధానం, ముఖ కవళికలు, హావభావాలు ఇలా ప్రతీ ఒక్కటి మక్కికి మక్కి దింపేసాడు. ఇది ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక మమ్ముటి గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, ఎలాంటి పాత్రని అయిన అలవోకగా చేసే ఆయన రాజశేఖర్ రెడ్డి పాత్రలో కూడా జీవించేసాడు. మిగిలిన తారాగణం కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా సపోర్ట్ ని ఇచ్చారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాత్రలను కూడా చూపిస్తారేమో అని అనుకున్నారు కానీ, వాళ్ళను కించపరిచే విధంగా ఒక్క సన్నివేశం కూడా పెట్టకపోవడం, కేవలం జగన్ ఇమేజి ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే సినిమా తియ్యడం గమనార్హం.

చివరి మాట :

వైసీపీ అభిమానులకు ఈ సినిమా ఒక కనులపండుగ లాంటిది. చాలా సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయి.

నటీనటులు : మమ్ముటి , జీవా, మహేష్ మంజ్రేకర్  తదితరులు
దర్శకత్వం : మహి వి రాఘవ్
నిర్మాత : శివ మేక
సంగీతం : సంతోష్ నారాయణ్

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here