రామాయణం ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న విడుదలైంది. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా కనిపించగా.. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. మెుదటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్న ఈ సినిమా విడుదలయ్యాక దీనిపై వివాదాలు భగ్గుమన్నాయి. వాల్మీకి రచించిన రామాయణం ఇది కాదని అసలు రామాయణాన్నే వక్రీకరించే ఈ సినిమాని చిత్రీకరించారని చాలామంది మండిపడుతున్నారు.
దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని భిన్నంగా రూపొందించారు. సాంప్రదాయ రామాయణాన్ని అసలు ఏమాత్రం ఫాలో కాలేదని తెలుస్తోంది. రాముని వేషధారణ నుండి అనేక విషయాల్లో వాల్మీకి రామాయణానికి అసలు పొంతనలేదు. రావణాసురుడి రూపం అయితే మరీ దారుణం అంటున్నారు. ఏ కోశాన కూడా సైఫ్ అలీ ఖాన్‌లో రావణుడు కనిపించలేదు.
అయితే మెదట టీజర్ రిలీజ్ అయినపుడే సినిమాపై తీవ్ర విమర్శలు రావటంతో ఆరు నెలలు వాయిదా వేశారు. దీంతో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్నెళ్లు ఆలస్యంగా జూన్ 16న రిలీజ్ అయింది. ఈ చిత్రంపై ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. రామాయణాన్ని కించపరిచేలా సినిమా తీశారంటూ ఫైర్ అవుతున్నారు.
మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన సున్నితమైన పాత్రలను ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా అని మండిపడుతున్నారు. ఇక ఢిల్లీకి చెందిన హిందూ సేన అనే సంస్థ దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆదిపురుష్ సినిమా నుంచి అభ్యంతరకర సన్నివేశాలు వెంటనే తొలగించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రదర్శనకు అడ్డంకులు పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే సినిమాకు పెద్ద దెబ్బె పడుతుంది.
అటు నేపాల్‌లో కూడా ఆదిపురుష్ మూవీ మీద వ్యతిరేకత వ్యక్తమైంది. సీత భారతదేశంలో పుట్టారని ఉన్న ఓ డైలాగ్ ని వారు తప్పుబట్టారు. దీంతో ఫస్ట్ డే మార్నింగ్ షోలకు బ్రేక్ పడింది. ఆ డైలాగ్ తొలగించడంతో శుక్రవారం మధ్యాహ్నం నుండి నేపాల్‌లో షోలు మొదలయ్యాయి. ఇక ఫస్ట్ డే ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్లకు పైగా షేర్ రాబట్టింది.