తాను ఏ ఉద్దేశంతో పోస్ట్ పెట్టారోగానీ నటి ఊర్వశీ రౌతేలా నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్‌ని ఏపీ సీఎం అని వ్యాఖ్యానించడమే అందుకు కారణం. పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ . ఇందులో ఆమె ఓ పాటలో నటించింది. సినిమా శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా సామాజిక మాధ్యమం ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టారామె. ‘బ్రో’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో తెరను పంచుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సంబంధిత పోస్ట్‌పై ట్రోల్స్ వెల్లువెత్తాయి. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్’, ‘మీకు ఈ విషయం ఎవరు చెప్పారు?’, ‘పవన్ సీఎం ఎప్పుడయ్యారు?’, ‘ట్వీట్ ఆఫ్ ది ఇయర్’ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొందరు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

”ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న విడుదల అవుతోన్న ‘బ్రో ది అవతార్’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అహంకారపూరితంగా నడుచుకునే ఓ యువకుడికి మరణించిన తర్వాత అవకాశం వస్తే… తన తప్పుల్ని ఎలా సరి చేసుకున్నాడు? అనేది సినిమా కథ. థియేటర్లలో కలుద్దాం” అని ఊర్వశి రౌతేలా ట్వీట్ చేశారు. ప్రీ రిలీజ్ వేడుకలో పవన్, సాయిలతో దిగిన ఫోటో షేర్ చేశారు. ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, అంతకు ముందు ప్రముఖ నిర్మాత ఏయం రత్నం, హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతున్న సమయాల్లోనూ అభిమానులు ‘సీయం సీయం’ అని అరిచారు. ఆ అరుపులు విని నిజంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు ఉన్నారు ఊర్వశి రౌతేలా.

ఆమె ట్వీట్ సినీ ప్రేక్షకుల మధ్య మాత్రమే కాదు, రాజకీయ పార్టీల అభిమానుల మధ్య చర్చకు కారణం అవుతోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో తొలి చిత్రమిది. మావయ్యతో కలిసి నటించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తేజ్. ఇందులో తనది గెస్ట్ రోల్ కాదని, 80 పర్సెంట్ సినిమాలో ఉంటానని పవన్ తెలిపారు.’బ్రో’ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఆయన తీసిన తమిళ హిట్ ‘వినోదయ సీతం’ ఆధారంగా రూపొందిన చిత్రమిది. అయితే… తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ‘మై డియర్ మార్కండేయ’ పాటలో ఊర్వశి రౌతేలా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.