ఇటీవలే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. తాజాగా తన మంచి మనసును చాటుకుంటూ సింగిల్ మదర్స్ కోసం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్‌కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామని చెప్పారు. సీఎస్ఆర్- అపోలో వైస్ చైర్‌పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.. సింగిల్ మదర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లి ఉచితంగానే వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు.నగరంలోని అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అపోలో చిల్డ్రన్స్ హాస్పటల్స్ లోగోను విడుదల చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

‘‘ప్రెగ్నెన్సీ సమయంలో నాకు అండగా నిలిచి ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ హాస్పటల్స్ లోగో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇదొక ఎమోషనల్ జర్నీ. చిన్నారి అనారోగ్యానికి గురైతే తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో, ముఖ్యంగా ఒక తల్లి ఎంతటి ఒత్తిడికి లోనవుతుందో అర్థం చేసుకోగలను. ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతోమంది మహిళలను కలిశా. ఒంటరి మహిళల కోసం ఏదైనా సాయం చేయాలనిపించింది. అందుకే వారాంతాల్లో సింగిల్ మదర్స్ పిల్లలకు ఫ్రీ కన్సల్టేషన్ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. పేరెంటింగ్ ఎంతో ముఖ్యమైన విషయం.

పిల్లల పెంపకంలో నాకెప్పుడూ సాయం చేసే భర్త ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. కానీ, సింగిల్ మదర్స్ పరిస్థితి ఏమిటి? ఎలాంటి సాయం లేకుండా వాళ్లు పిల్లలను ఎలా పెంచుతారు? అనే విషయం నన్నెంతో బాధించింది. వాళ్లకు సాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. క్లీంకార పుట్టిన తర్వాత నా జీవితం ఎంతో మారింది. ఇప్పుడు నేనెంతో ఆనందంగా ఉన్నా. జీవితం విలువను తను నాకు తెలియజేసింది. తన వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా’’ అని ఆమె అన్నారు. గర్భంతో ఉన్న సమయం నుంచి డెలివరీ వరకు సాగిన జర్నీ మరచిపోలేనిదని.. ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఉపాసన చెప్పారు. ఇప్పుడు అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు చాలా ఎమోషనల్ జర్నీ అని పేర్కొన్నారు.