LB Sriram : అమ్మో ఒకటో తారీఖు అంటూ మధ్యతరగతి కుటుంబ పెద్దగా ఇంటి బాధ్యతలు మోస్తూ ప్రతి మధ్యతరగతి వాడు తన బాధలే చెబుతున్నాడనుకునే అంతగా ఆ పాత్రలో లీనమయ్యారు ఎల్బీ శ్రీరామ్. ఇలా ప్రేక్షకులను తన నటనతో ఏడిపిస్తూ.. నవ్విస్తూ.. రెండు దశాబ్ధాలకుపైగా అలరిస్తున్నారు. ఎల్బీ శ్రీరామ్ కామెడీ చేసినా.. ఎమోషనల్ సీన్స్ చేసినా ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం.
ఇలా విభిన్నమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు హాస్య నటుడు ఎల్బీ శ్రీరామ్. `ఏప్రిల్ 1 విడుదల`తో చిన్న పాత్రతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన `కోకిల` నుంచి సొంత ఊరు వరకు దాదాపు పదకొండు సినిమాలకు పైనే డైలాగ్ రచయితగా పని చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `హిట్లర్` నాగార్జున నటించిన `వారసుడు` `హలో బ్రదర్` రాజశేఖర్ నటించిన `ఓంకారం` రాజేంద్ర ప్రసాద్ `అప్పుల అప్పారావు` వంటి సినిమాలున్నాయి.
ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన `అమ్మో ఒకటో తారీఖు` సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఎల్బీ శ్రీరామ్ ఆ తర్వాత హాస్య నటుడిగానే కొనసాగారు. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం షార్ట్ ఫిల్మ్స్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన కారణం చెప్పారు. తనను సినిమాలకు దూరం చేసిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇంతకీ ఈ విలక్షణ నటుడిని సినిమాలకు దూరం చేసిన ఆ విషయం ఏంటంటే..?
అమర గాయకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా అమలాపురం వెళ్లిన ఎల్బీ శ్రీరాం ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే రెండు దశాబ్ధాలకు పైగా తన నటనా ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాలకు ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తోందో కారణం చెప్పారు. తనకు నచ్చనిది ఏదైనా వదులుకుంటానని.. నచ్చిన చోటే సంతృప్తిగా జీవిస్తానని ఎల్బీ శ్రీరాం అన్నారు.
“23 ఏళ్ల క్రితం అవకాశాల కోసం ఇండస్ట్రీకి వచ్చాను. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నన్ను ఇండస్ట్రీ గుర్తించింది. `అమ్మో ఒకటో తారీఖు` సినిమా ద్వారా నాలోని కొత్త నటుడిని ఇండస్ట్రీ చూసింది. ఇంత వరకు వివిధ పాత్రల్లో 500 కు పైగా సినిమాలు చేశాను. గత ఆరేళ్లుగా నేను ఇండస్ట్రీకి దూరంగా ఎందుకు వుంటున్నానో తెలుసా. హాస్య నటుడి ముద్ర నుంచి బయటికి రావడం కోసమే. నేనో సంపూర్ణ నటుడిని. నన్ను నేను కేవలం హాస్యానికే పరిమితం చేసుకోదలుచుకోలేదు. ఆ చట్రం నుంచి బయట పడాలనుకుంటున్నాను. అందుకే నేను సినిమాలుకు దూరంగా వుంటున్నాను. అని ఎల్బీ శ్రీరాం చెప్పారు.
కమెడియన్ చట్రం నుంచి బయటపడేందుకే సందేశాత్మక లఘు చిత్రాల నిర్మాణంపై దృష్టి పెట్టానని ఎల్బీ శ్రీరాం చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి ఆరేళ్లలో 60 లఘు చిత్రాలు నిర్మించానని తెలిపారు. తాను ఇండస్ట్రీలో ఉన్న సమయంలో దాదాపు 40 మంది హాస్య నటులు ఉండేవారని అందులో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నానని అన్నారు. ఇప్పుడు సమాజ హితం కోసం లఘు చిత్రాలని నిర్మిస్తున్నానని స్పష్టం చేశారు.