Taapsee Pannu : సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. సౌత్‌తో పాటు నార్త్ లోనూ హీరోయిన్ గా బోలెడు సినిమాలు చేసింది. సుమారు దశాబ్దం పాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. ఇక్కడ నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో నార్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోంది. ఇక తనకు నచ్చిన విషయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. ఇక తాజాగా ఈ పంజాబీ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథియాస్ బోతో మూడు ముళ్లు వేయించుకుంది.
రాజస్థాన్ ఉదయ్ పూర్ వేదికగా ఈ వివాహం జరిగింది. అయితే, తన పెళ్లిని సీక్రెట్ గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో ఆమె తాజాగా వెల్లడించింది. పెళ్లి తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ, పలు కీలక విషయాలను వెల్లడించింది. పెళ్లి అనేది తన వ్యక్తిగత విషయం కావడం వల్లే రహస్యంగా ఉంచినట్లు చెప్పుకొచ్చింది. “నా పెళ్లికి సంబంధించిన విషయాలను బయటకు చెప్పాలి అనుకోలేదు. నా పెళ్లి గురించి ఎదుటి వారిలో క్యూరియాసిటీ కలిగించాలి అనుకోలేదు. నా పెళ్లి గురించి, నా భర్త గురించి చర్చ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం. అయితే, పెళ్లి చేసుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకోలేదు. పెళ్లి ముందు అనవసర చర్చ వద్దు అనుకున్నాం. మా బంధుమిత్రులకు మా పెళ్లి గురించి తెలుసు. వాళ్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాం.
పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దాన్ని ఆనందంగా జరుపుకోవాలి అనుకున్నాం. హంగు ఆర్భాటాలకు తావు లేకుండా ముఖ్యమైన వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. నా పెళ్లి, ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేయాలి అనుకోవడం లేదు. మున్ముందు పంచుకోవాలి అనిపిస్తే షేర్ చేస్తాను” అని చెప్పుకొచ్చింది. మార్చి 23న ఉదయ్ పూర్ లో తాప్సీ, మాథియాస్ బో పెళ్లి జరిగింది. రీసెంట్ గా వీరి పెళ్లికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.