80 మల్టీస్టారర్​ సినిమాలతో బుర్రిపాలం బుల్లోడు కృష్ణ రికార్డ్

- Advertisement -

తెలుగు వీరుడు.. సాహసాల ధీరుడు.. టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. గుండెపోటుతో ఇవాళ ఉదయం ఆయన మరణించారు. కృష్ణ మరణంతో సినీ వినీలాకాశం చిన్నబోయింది. ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగియారు. ప్రముఖులంతా ఆయన నటించిన సినిమాలను ఆయన సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణతో వారికి ఉన్న అనుబంధాన్ని స్మరిస్తున్నారు. కృష్ణ సినీ రికార్డుల్లో ఏ హీరోకూ లేనన్ని రికార్డులున్నాయి.

 

- Advertisement -

సాహసమే ఊపిరిగా బతికి హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సూపర్​ స్టార్ కృష్ణ. తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించారాయన. తన రికార్డులను తానే తిరగరాసుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఆయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి.

 

సూపర్‌స్టార్‌ కృష్ణ తన సినీకెరీర్​లో సుమారు 350 సినిమాలు చేశారు. ప్రతి చిత్రం దేనికదే స్పెషల్. కొన్ని మూవీస్​లో ఆయన చేసిన సాహసాలు, చెప్పిన డైలాగులు, వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అలరిస్తే.. మరికొన్ని చిత్రాల్లో ఆయన ఇతర హీరోలతో కలిసి చేసిన సందడి కనిపిస్తుంది. ఈ రోజుల్లో మల్టీస్టారర్లు అంటే చాలా కష్టం. ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్​ని సంతృప్తి పరచడం అంటే మామూలు విషయం కాదు. మరోవైపు కొన్నిసార్లు హీరోల మధ్య కూడా సరైన కమ్యునికేషన్ ఉండకపోవడం వల్ల ఇప్పటి డైరెక్టర్లు దాదాపు మల్టీస్టారర్ల జోలికి వెళ్లడం లేదు. కానీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా 80 మల్టీస్టారర్ సినిమాలు చేసి రికార్డు క్రియేట్ చేశారు. ఆయన ఏయే హీరోలతో కలిసి నటించారో తెలుసుకందాం..

ఎన్టీఆర్‌తో అలా.. కృష్ణ మరో హీరోతో కలిసి నటించిన తొలి చిత్రం ‘ఇద్దరు మొనగాళ్లు’. అందులో కాంతారావుతో కలిసి తెరను పంచుకున్నారు. ఆ తర్వాత ఈ కాంబోలో మరో రెండు చిత్రాలొచ్చాయి. ‘పాతాళభైరవి’ సినిమాలోని ఎన్టీఆర్‌ నటనకు ముగ్దుడైన కృష్ణ.. ఆయనతోనే కలిసి నటించే అవకాశం రావడం గురించి ప్రత్యేకంగా చెప్పేవారు. ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా ‘స్త్రీ జన్మ’. తర్వాత, ఈ కాంబినేషన్‌లో ‘నిలువు దోపిడి’, ‘విచిత్ర కుటుంబం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘వయ్యారి భామలు-వగలమారి భర్తలు’ సినిమాలొచ్చాయి. ఈ ఐదు చిత్రాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు సోదరులుగా నటించడం విశేషం.

 

ఏఎన్నార్‌తో ఇలా.. ‘ఎప్పటికైనా హీరోనికావాలి’ అని అక్కినేని నాగేశ్వరరావును చూసి అనుకున్నారట కృష్ణ. ఏఎన్నార్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను తానూ సంపాదించుకోవాలని నిర్ణయించుకుని అనుకున్నట్టుగానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తనకు స్ఫూర్తినిచ్చిన అక్కినేనితో కలిసి ‘మంచి కుటుంబం’, ‘అక్కాచెల్లెలు’, ‘హేమాహేమీలు’, ‘గురుశిష్యులు’, ‘ఊరంతా సంక్రాంతి’, ‘రాజకీయ చదరంగం’ సినిమాల్లో నటించారు.

ఇతర నటులతో.. కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా కృష్ణంరాజు నిలిచారు. వీరు కలిసి నటించిన 19 చిత్రాలు.. వీరి అనుబంధం ఎలాంటిదో నిరూపించాయి. శోభన్‌బాబుతో 13, మోహన్‌బాబుతో 4, కాంతారావుతో 3, శివాజీ గణేశన్‌తో 3, రజనీకాంత్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్‌, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమా చేసిన కృష్ణ తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 చిత్రాల్లో కనిపించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here