తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రేక్షకులకు చేరువైన కామెడి షో జబర్దస్త్. ఈ కామెడీ షో ద్వారా ఎందరో కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. వారిలో కొందరు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మంచి స్థాయిలో ఉన్నారు. మరి కొందరు షో లో లేడీ గెటప్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. కొందరు ఈ షో ద్వారా భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరుకుంటూ ఉంటే మరికొందరు కమెడియన్లు మాత్రం తెరవెనుక అక్రమాలకు పాల్పడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కొందరు అలా వార్తలు నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ కోసం పోలీసులు తెగ వెదికేస్తున్నారట. ఏకంగా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవటంతో అతనిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి అలియాస్ హరితపై కేసు నమోదు అయ్యింది. చంటి టీమ్‌లో లేడీ గెటప్‌లు వేసే హరిత తెర వెనుక గట్టుచప్పుడుకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో సుమారు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు.
దర్యాప్తులో అతను హరి పేరు చెప్పడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంతో హరికి సంబంధం ఉందని, సరుకును తరలించే ప్లాన్ కూడా అతడిదేనని పోలీసులకు సమాచారం అందింది. ఈ ఆపరేషన్‌లో హరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ట్రై చేసినప్పటికీ, తమ కళ్లుగప్పి అతను తప్పించుకొని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు హరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే హరిపై ఈ ఆరోపణలు రావటం, కేసు నమోదవటం మెుదటిసారి కాదట. గతంలో కూడా అతడిపై పలుమార్లు కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. 2021 మే నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో 8 మంది స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐతే జబర్దస్త్ హరి అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.