ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అంటే ఖుషి అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ-సమంతల క్రేజీ కాంబినేషన్లో నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఈ చిత్రం మీద ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైనప్పటికీ.. అన్ని అడ్డంకులనూ అధిగమించి సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. సెప్టెంబరు 1న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఇప్పటికే పాటలు.. ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచాయి. హైప్ ఇంకా పెంచేందుకు మంగళవారం హైదరాబాద్‌లో మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించింది ఖుషి టైం. సీతారామం తర్వాత ఇలాంటి ఈవెంట్ ఖుషికే జరిగింది. ఇక విజయ్, సామ్ లు ఇద్దరూ ప్రచారంలో బిజీ అయ్యారు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఒకరి ఇష్టాలను మరొకరు తెలిపారు. విజయ్ భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై సమంత స్పందిస్తూ.. ‘ఆమె చాలా సాధారణంగా ఉండాలి. అతడి కుటుంబంతో కలిసిపోవాలి’ అని తెలిపారు. సమంత సమాధానాన్ని విజయ్ అంగీకరించారు. విజయ్ ఫోన్ కాల్స్ తక్కువగా మాట్లాడతాడని, మెసేజ్‌లు ఎక్కువగా చేస్తుంటాడని సమంత పేర్కొన్నారు.

‘‘ఇటీవల విడుదలైన వాటిల్లో విజయ్‌కు బాగా నచ్చిన చిత్రం ‘బేబీ’. గేమింగ్ యాప్ ఎక్కువగా వాడుతుంటాడు. అతడికి స్నేహితులు చాలామంది ఉన్నారు’’ అని సమంత తెలిపారు. ‘‘రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. వీళ్లు సమంత బెస్ట్ ఫ్రెండ్స్. అన్ని రకాల వంటలను సామ్ ఆస్వాదిస్తుంది. ఎంత కోపమొచ్చినా ఆమె అసభ్యంగా మాట్లాడదు’’ అని విజయ్ చెప్పారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘ఖుషి’లో విప్లవ్‌గా విజయ్, ఆరాధ్యగా సమంత కనిపించనున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌లో విజయ్, సామ్ స్టేజ్‌పై డ్యాన్స్ చేసి అలరించారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సినిమాకి ముందు వీరిద్దరు ‘మహానటి’లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.