Sakshi vaidya : సాక్షి వైద్య ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఇంతకుముందు ఆమె మోడలింగ్ చేసిందిగానీ, హీరోయిన్ గా కెమెరా ముందుకు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే. ఈ ముంబై బ్యూటీకి ఫస్టు ఛాన్స్ ఇంతటి భారీ బడ్జెట్ సినిమా నుంచి వెళ్లడం నిజంగా అదృష్టమే. ఆకర్షణీయమైన కళ్లతో … నాజూకుదనంతో ఈవెంట్స్ లో ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తెరపై ఎలా మెరుస్తుందనేది చూడటానికి ప్రేక్షకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. సాక్షి వైద్య కూడా అఖిల్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. ఆమె చేసిన ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వంటి భారీ సినిమాతో ‘ఏజెంట్’ తలపడుతుండటం విశేషం. సురేందర్ రెడ్డి టేకింగ్ .. అఖిల్ ఎంచుకున్న కొత్త జోనర్ .. లుక్ తోనే ఆయనకి పడుతున్న మార్కులు చూస్తుంటే, ఈ సినిమా హిట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ చిన్నది ఏజెంట్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ గొడవ గురించి వివరించింది. ఈ సినిమాకు సరేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏ డైరెక్టర్ అయినా సినిమాలో సన్నివేశం బాగా రావడానికి ప్రయత్నిస్తారు. ఏజెంట్ చిత్రీకరణ సమయంలోనూ అదే జరిగింది. సాక్షి ఓ సన్నివేశంలో సరిగా చేయలేదని దర్శకుడు ఆమెను ఘోరంగా తిట్టారుట. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ..‘‘ ఒక దర్శకుడిగా ఆయనపై చాలా ఒత్తిడి ఉంటుంది. నేను దాన్ని అర్థం చేసుకోగలను. కొన్ని సీన్స్‌లో నటించేటప్పుడు ‘ఇది బాగుంది. కానీ, ఇంకా బాగా చేయండి’ అని చెప్పేవారు. నేను దానికి తగినట్లు మెరుగ్గా ఎలా చేయాలా అని ఆలోచించేదాన్ని. ఒక సినిమా వెనుక చాలా మంది కష్టం ఉంటుంది. సురేందర్ రెడ్డి (Surender Reddy) కొన్ని రోజులు వీల్‌ఛైర్‌లో ఉంటూ కూడా షూటింగ్‌కు వచ్చారు. ఆయనకు సినిమా అంటే అంత ఇష్టం’’ అని చెప్పింది.

అయితే ఈ అమ్మడి విషయంలో మరొక వార్త ప్రచారంలో ఉంది. అఖిల్ సరసన నటించిన హీరోయిన్స్ కు కెరీర్ ఉండదని కొందరు అంటున్నారు. అఖిల్ సినిమాలతో ఇంతకుముందు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ ఆ తరువాత రాణించలేకపోయారనే ఒక టాక్ ఉంది. ‘అఖిల్’ సినిమాతోనే సాయేషా సైగల్ తెలుగు తెరకి పరిచయమైంది. మెరుపుతీగలాంటి ఈ సుందరికి ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దాంతో ఇక్కడ మరో సినిమా చేసే ఛాన్స్ ఆమెకి లేకుండా పోయింది. ఆ తరువాత ‘హలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కల్యాణి ప్రియదర్శన్ పరిస్థితి కూడా అదే.