Naresh : ప్రస్తుతం నరేష్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఎంతో ఆనందంతో పండగ చేసుకుంటున్నాడు. ఎన్నో రోజులుగా ఆయన ఎదురుచూపులకు తెరదించుతూ కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బెంగుళూరులోని సిటీ సివిల్ న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయన నటించిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఇటీవల ఆయన మూడో భార్య రమ్య రఘుపతి వేసిన దావాను కోర్టు కొట్టేసింది. ఇరు పక్షాల వాదనను విన్న న్యాయస్థానం, మెరిట్ లేని కారణంగా ఆమె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు తాజాగా తీర్పును వెలువరించింది. సెన్సార్ బోర్డు చెప్పినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు పేర్కొంది. అలాగే, సెన్సార్ బోర్డు ఒక చిత్రాన్ని కల్పితమని సర్టిఫై చేస్తే దాని విడుదలను ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకునే ప్రసక్తే లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇక మరో కేసులోనూ నరేష్ అతని కుటుంబ సభ్యులు ఆయన భార్య రమ్య రఘుపతికి వ్యతిరేకంగా వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నానక్‌రామ్‌గూడలోని తన ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఈ దావాను వేశారు. అయితే అంతకుముందు రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతి పై గృహ నిషేదం ప్రకటించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేదం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవలే రమ్య రఘుపతి.. పవర్ టీవీ అనే కన్నడ ఛానల్ చేత ఇల్లీగల్ గా నరేష్ ఇంటి మీద, పవిత్ర మీద స్టింగ్ ఆపరేషన్ లు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని నిర్ధారించింది. దీంతో కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేస్తారనే విషయం తెలిసిందే.