Prabhas : ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సలార్’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 144 కోట్లు వసూళు చేసింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ నేపథ్యంలో ప్రభాస్ హాలీవుడ్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ‘సలార్’, ‘సలార్ 2’తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. అద్భుతమైన స్క్రిప్ట్, టాలెంటెడ్ టీమ్ తో కలిసి పని చేసే అవకాశం రావడంతోనే ఈ ప్రాజెక్టు చేయాలని భావించినట్లు వెల్లడించారు. ‘సలార్’లోని కథనం, క్యారెక్టర్ బాగా ఆకర్షించినట్లు చెప్పారు. తన కెరీర్ లోనే భిన్న కథాశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సరికొత్త, సవాల్ తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు వివరించారు. ఈ సినిమాతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగినట్లు వెల్లడించారు. ‘బాహుబలి’ సినిమా తన కెరీర్ కు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పిన ప్రభాస్, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ అత్యుత్తమంగా రావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇకపై యాక్షన్ సినిమాలపైనే ఆసక్తి చూపనున్నట్లు తెలిపారు.

గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని, నటుడిగా మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే సవాల్‌తో కూడిన పాత్రలు ఎంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో సినిమా పరిశ్రమలు ప్రాంతీయ సరిహద్దులను దాటుతున్నాయని వెల్లడించారు. విభిన్న కథలు, కథనాలతో అద్భుత సినిమాలు తెరకెక్కుతున్నాయని తెలిపారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారతీయ ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. అర్థవంతమైన కథలు, తాజా కథనాలు, వినూత్నమైన చిత్ర నిర్మాణానికి డిమాండ్ ఉందన్నారు.