రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండండి ఆడ బిడ్డ పుట్టడంతో మెగా ఫ్యామిలీ ఎంతో ఆనందంగా ఉంది. తన రాకతో మెగా కుటుంబంలోనే కాదు.. మెగా అభిమానుల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆ మెగా ప్రిన్సెస్‌కు వెల్‌కమ్ చెబుతూ సోషల్‌మీడియాలో లక్షల మంది పోస్ట్‌లు పెట్టారు. ఈ మేరకు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా రామ్‌చరణ్ బిడ్డ గురించి ఆనందం వ్యక్తం చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.

‘‘గతేడాది రామ్ చరణ్ అన్న తండ్రి కానున్నాడని వార్త తెలిసినప్పటి నుంచి మా కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉంది. తన రాకతో రామ్ చరణ్ ఫ్యామిలీ పరిపూర్ణమైంది. మెగా కజిన్స్ అందరినీ చరణ్ అన్న చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే తనని మేము బాపూజీ అని పిలుస్తాం. అతడు ప్రతి వారిపై ప్రేమను చూపుతాడు. ఇక ఉపాసన వదిన ఓ శక్తిమంతమైన మహిళ. వీళ్లిద్దరి సంరక్షణలో ఆ పాప కచ్చితంగా గొప్పగా ఎదిగి ఉన్నత స్థాయికి వెళ్తుంది’’ అంటూ తన ఆనందాన్ని తెలిపింది.

ఇక తాజాగా రామ్‌చరణ్ మీడియాతో మాట్లాడారు.‘‘ఉపాసన, పాపను అపోలో వైద్యులు చాలా బాగా చూసుకున్నారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్లు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన అభిమానులకు థ్యాంక్స్. మీరు చూపిస్తున్న ప్రేమకు నాకు మాటలు రావడం లేదు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఒక తండ్రికి ఇంతకు మించిన వేరే ఆనందం ఏమీ ఉండదు. నాన్న (చిరంజీవి) కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బాబు/పాప ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలనే విషయమై నేనూ ఉపాసన ముందే మాట్లాడుకున్నాం. అదేంటో ఇప్పుడే చెప్పలేను. పేరు పెట్టే రోజున నేనే స్వయంగా మీతో పంచుకుంటా’’ అని రామ్‌చరణ్ అన్నారు.