Navadeep : టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నవదీప్ ఒకరు. ఆయన కెరీర్ హీరోగా హిట్ సినిమాలతో మొదలైంది. తర్వాత అగ్ర కథానాయకుల చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ… మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే… ఆశించిన విజయాలు రాలేదు. దాంతో కొంత విరామం తీసుకుని కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నవదీప్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘లవ్ మౌళి’. అవనీంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నవదీప్ లుక్, ‘ఏంతమ్ ఆఫ్ లవ్ మౌళి’ పాటకు మంచి స్పందన వచ్చింది.
ఇందులో నవదీప్ కొత్తగా ఉన్నారని, ‘నవ్ దీప్ 2.O’ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. లేటెస్టుగా ‘లవ్ మౌళి హీరో’ టీజర్ విడుదల చేశారు. ‘లవ్ మౌళి’ హీరో టీజర్ కొందరికి షాక్ ఇస్తే… రెగ్యులర్ కంటెంట్ కాకుండా కొత్త రకం సినిమాలు కోరుకునే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీజర్ ప్రారంభమే ఒంటి మీద నూలు పోగు లేకుండా నవదీప్ కనిపించారు. మందు బాటిల్ పగలగొట్టి వైవిధ్యంగా కనిపించారు. సినిమాలో హీరో హిప్పీ తరహా రోల్ చేశారని అర్థం అవుతోంది. టీజర్ ఆవిష్కరణ కార్యకమంలో నవదీప్ మాట్లాడుతూ..
”జీవితంలో మనం ఎన్నో చేయాలని అనుకుంటాం. కానీ, జరిగేది వేరు. జీవిత పరుగులో నిగగ్నమైన మనం ఆ విషయాన్ని గమనించం. ఎక్కడో ఒక దగ్గర ఆగి ఆలోచిస్తే… మనకు ఆ విషయం తెలుస్తుంది. నేనూ వేర్వేరు సినిమాలు, అనవసరమైన సినిమాలు చేశా. కరోనా వల్ల వచ్చిన విరామం (లాక్‌డౌన్)లో నా విలువ ఏమిటో తెలుసుకున్నా. అప్పుడు విన్న కథ ఇది. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు ‘లవ్, మౌళి’ దగ్గరగా అనిపించింది. ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నా” అని అన్నారు.