Thalapathy Vijay Goat Movie : సినిమా హీరోల మధ్య శత్రుత్వం ఉంటుందో లేదో కానీ వాళ్ల ఫ్యాన్స్ మధ్య మాత్రం ఏకంగా యుద్ధమే జరుగుతుంటుంది. తమ అభిమాన హీరోకు సరైన హిట్ ఇవ్వలేకపోయినా.. మంచి మ్యూజిక్ చేయకపోయినా.. చివరకు సినిమా బాగోలేదని ఎవరైనా అన్నా వెంటనే రంగంలోకి దిగుతారు. దానికి కారణమైన వారిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. కొంతమంది ఈ ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్యలకు యత్నించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని ఘటనల్లో సంబంధిత వ్యక్తులు తమ క్రాఫ్ట్ వదిలేసి వెళ్లిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
తాజాగా ఇలాంటి పరిస్థితే ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా ఎదురైంది. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ గురించి తెలిసిందేగా. తమ హీరో సినిమా కాస్త అటూ ఇటైనా అభిమానులు దానికి సంబంధించిన వారిని ఆడేసుకుంటారు. అయితే విజయ్ లేటెస్ట్ మూవీ గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని విజిల్ పోడు అనే లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది.
అయితే ఈ పాట విజయ్ అభిమానుల అంచనాలను అందుకోలేదట. అసలు విజయ్ స్థాయికి ఆ పాట నాసిరకంగా ఉందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యువన్ ను మాస్ ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోలింగ్ ఏ స్థాయికి వెళ్లిందంటే అది తట్టుకోలేక ఆయన ఏకంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసే అంత.
తాజాగా యువన్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నెట్టింట కనిపించడం లేదు. సెర్చ్ లో ఆయన ఐడి టైప్ చేసి వెతికినా కూడా కనిపించడం లేదు. విజిల్ పోడు సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ వల్లే యువన్ డీయాక్టివేట్ చేశారని కొందరు చెబుతున్నారు. మరికొందరేమో తర్వాతి పాట మీద ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి ఇలా చేశారని మరికొందరు చెప్తున్నారు.
అయితే తన అకౌంట్ డిలీట్ అవ్వడంపై యువన్ స్పందించారు. తనకు మెసేజ్ చేసిన అందరికి థాంక్స్ అని చెప్పిన ఆయన అది ఒక టెక్నీకల్ ఎర్రర్ అని తన టీమ్ ఆ సమస్య మీద పని చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తిరిగి వస్తానని క్లారిటీ ఇచ్చారు.