Thaman మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ పై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా నుండి తమన్ అవుట్ అనే వార్త కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది. అయితే దాని గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా సెటైర్ వేస్తూ ఇన్ డైరెక్ట్ గా రియాక్ట్ అయ్యాడు తమన్. తాజాగా బ్రో సినిమా ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా గుంటూరు కారం గురించి మాట్లాడాడు. సినిమా నుండి నన్ను తీసేస్తే ప్రొడ్యూసర్ చెప్తారు కదా, అంతా బాగానే ఉంది. కానీ ఏవేవో రాస్తున్నారు. అందరూ ఆ సినిమా మీదే పడ్డారెందుకో అర్థం కావట్లేదు అంటూ తమన్ రియాక్ట్ అయ్యాడు. ఇక క్రికెట్ మీద ఫోకస్ తో సాంగ్స్ టైమ్ కి ఇవ్వడం లేదనే ప్రశ్న కూడా తమన్ కి ఎదురైంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సోషల్‌మీడియా వ్యతిరేకతపై స్పందించారు. ‘‘నెటిజన్లు పొగిడిన సమయంలో ఎలా అయితే తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు. దీనిపై ఓ విలేకరి స్పందిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని కామెంట్ చేస్తున్నారు?’’ అని అడగ్గా.. తమన్ తనదైన శైలిలో బదులిచ్చారు.

‘‘నాకు మద్యం అలవాటు లేదు. గర్ల్‌ఫ్రెండ్స్ లేరు. ఏ ఇతర వ్యసనాలూ లేవు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు, నా స్నేహితులందరితో కలిసి క్రికెట్ ఆడుతుంటా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్‌లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ ఉన్నారు. అదే నా ఎక్సర్‌సైజ్, నా ఎమోషనల్ నెట్‌వర్క్. నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు చెప్పాలి? నా పని వదిలేసి నేను వెళ్లడం లేదు. వర్క్ టైమ్ అయ్యాక రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ క్రికెట్ ఆడి.. ఇంటికి వెళ్లిపోతా. అలా, చేయడం వల్ల నా ఒత్తిడి కొంతవరకూ తగ్గుతుంది’’ అని తమన్ తెలిపారు.