MM Keeravani : ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ సినిమా వేదికపై చాటింది. ఆస్కార్ గెలిచి చరిత్ర లిఖించింది. తెలుగు సినిమా కలలో ఊహించని విషయాన్ని రాజమౌళి సహకారం చేసి చూపించారు. తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన ఆర్ఆర్ఆర్ టీం ని టాలీవుడ్ సత్కరించుకుంటుంది. నేడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ లకు సంబంధించిన వారంతా కలిసి ఆదివారం హైదరాబాదులో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుక పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కీరవాణి మాట్లాడుతూ.. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడానికి కారణం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అని వాళ్లకు బదులుగా తాను చంద్రబోస్ అవార్డులు అందుకున్నామని అన్నారు. ఏ గుడిలోనైనా మూల విగ్రహాలు ఉంటాయి. అవి బయటకు రావు కాబట్టి వాటికి బదులుగా ఊరేగింపులో పాల్గొనడానికి ఉత్సవ విగ్రహాలు కూడా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు భారతదేశం తరుపున ఆస్కార్ అనే ప్రతిష్టాత్మక పురస్కారం రావడం వెనుక ప్రధానమైన కృషి చేసిన వాళ్ళు మూల విగ్రహాలు లాంటి వాళ్ళు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. వారు బయటకు రారు కాబట్టి వారి తరుపున పురస్కారాలు, సన్మానాలు, అభినందనలు అందుకోవడానికి ఉత్సవ విగ్రహాల నేను, చంద్రబోస్ ఉన్నాం. మా వంతు ఎంతో కృషి ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం వాళ్ళిద్దరూ అని కీరవాణి అన్నారు.

ఆస్కార్ అవార్డును అందుకునే విషయంలో తనకు ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేదని.. వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతో ఉన్నానని కీరవాణి తెలిపారు. ఎన్నో విపత్కర పరిస్థితులను జీవితంలో అనుభవించిన తనకు ఆస్కార్ అవార్డు అనేది పెద్ద ఎగ్జైట్మెంట్ ఇవ్వలేదని అన్నారు. బతికితే ఒక్క రోజైనా రామోజీరావు గారిలా బతకాలి మనిషన్నవాడు అని నా భార్య అంటుంది అటువంటి రామోజీరావు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను. రామోజీ రావు ఆస్కార్ కి ఇంత విలువ ఇస్తున్నారా అంటే దానికి కచ్చితంగా విలువ ఉందన్నమాట. అది ఎలాగైనా తీసుకురావాలని ఒకింత టెన్షన్ ఉందని అన్నారు. ఆ తరువాత ఆస్కార్ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కీరవాణి చెప్పుకొచ్చారు.