Matti Kusthi Review : భార్యాభర్తల మట్టికుస్తీలో గెలుపెవరిదో..?

- Advertisement -

Matti Kusthi Review : త‌మిళ సినిమాలు అంటేనే నేటివిటీకి దగ్గరగా ఉంటాయని నమ్మకం. అందులో కొంతమంది హీరోలైతే సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తారు. ఆ కోవకు చెందిన వాడే హీరో విష్ణు విశాల్‌. ‘అర‌ణ్య‌ ‘, ‘ఎఫ్ఐఆర్ ‘ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన విష్ణు.. ఇప్పుడు ‘మ‌ట్టి కుస్తీ’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. చెల్లా అయ్యావు తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ క‌థానాయిక‌. విష్ణు విశాల్‌తో క‌లిసి క‌థానాయ‌కుడు ర‌వితేజ స్వ‌యంగా నిర్మించ‌డంతో దీనిపై తెలుగులోనూ మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ సినిమా క‌థేంటి? థియేట‌ర్లో ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది? ఈ సినిమాతో ర‌వితేజ నిర్మాత‌గా విజ‌యాన్ని అందుకున్నారా? లేదా? తెలుసుకుందాం..

Matti Kusthi Review

రివ్యూ : 2.75/5

స్టోరీ ఏంటంటే.. : వీరా (విష్ణు విశాల్‌) ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుర్రాడు. ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు చదువుకున్నాడు. చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో మామ‌య్యే (క‌రుణాస్‌) అన్నీ తానై పెంచి పెద్ద చేస్తాడు. తండ్రీతాత‌లు సంపాదించిన ఆస్తిని జ‌ల్సా చేస్తూ తిర‌గ‌డం.. ఊర్లో చిన్న చిన్న పంచాయితీలు చేయ‌డం.. ఫ్రెండ్స్‌తో క‌లిసి క‌బ‌డ్డీ ఆడ‌టం.. ఇదే అతడి దిన‌చ‌ర్య‌. త‌ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి త‌న‌కంటే త‌క్కువ చ‌దువుకోవాల‌ని.. ఆమెకు పొడుగు జ‌డ ఉండాల‌ని అత‌నికంటూ కొన్నినియ‌మాలుంటాయి.

- Advertisement -

ఇక కీర్తి (ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ)ది మ‌రో క‌థ‌. కేర‌ళ‌లోని పాల‌క్క‌డ్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి బీఎస్సీ వ‌ర‌కు చ‌దువుకుంది. బాబాయ్ (మ‌నీష్‌కాంత్‌) ప్రోత్సాహంతో ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేక‌పోయినా రెజ్ల‌ర్‌గా మారుతుంది. అయితే అబ్బాయిలా క‌టింగ్ చేసుకొని.. కుస్తీలు ప‌ట్టే ఆ అమ్మాయిని చూసి ఏ ఒక్క‌రూ పెళ్లి చేసుకోవ‌డానికి ముందుకు రారు. అయితే కీర్తి బాబాయ్ ఆమె చ‌దువు కోలేద‌ని, పొడుగు జ‌డ ఉంద‌ని రెండు అబ‌ద్దాలు చెప్పి వీరాతో పెళ్లి జ‌రిపిస్తాడు.

అయితే ఓరోజు వీరాపై కొంద‌రు శ‌త్రువులు దాడి చేస్తారు. దీంతో వాళ్ల‌ను చిత్తు చిత్తుగా కొట్టి అత‌డిని కాపాడుకుంటుంది కీర్తి. కానీ, ఆ త‌ర్వాత నుంచి వీరా – కీర్తి దాంప‌త్య జీవితంలో ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లొస్తాయి. మ‌రి ఆ స‌మ‌స్య‌లేంటి? దానికి కార‌ణం ఎవ‌రు? ఈ భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ మ‌ట్టి కుస్తీలో ఎందుకు త‌ల‌ప‌డాల్సి వ‌చ్చింది? చివ‌ర‌కు వీళ్లు ఎలా ఒక్క‌ట‌య్యారు? అన్న‌ది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

Mattikusti review

మూవీ ఎలా ఉందంటే..? : ఈ మూవీ వినోదాత్మ‌కంగా సాగే భార్యాభ‌ర్త‌ల ప్రేమ‌క‌థ. ఆ క‌థ‌ని మ‌ట్టి కుస్తీ ఆట‌తో ముడిపెట్టి అందులో చ‌క్క‌టి సందేశాన్ని మేళ‌వించి తెర‌పై ఆస‌క్తిక‌రంగా ఆవిష్క‌రించాడు ద‌ర్శ‌కుడు చెల్లా అయ్యావు. ప్ర‌థమార్ధమంతా నాయ‌కానాయిక‌ల ప‌రిచ‌యం.. పెళ్లి త‌ర్వాత అహం వ‌ల్ల వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌మ‌స్య‌ల చుట్టూనే తిరుగుతుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఇది మ‌గాళ్ల ఈగో క‌థ‌.

త‌న భార్య ఎప్పుడూ త‌న కింద అణిగిమ‌ణిగి ఉండాలి.. చెప్పిందే చేయాలి అని ఆరాట‌ప‌డే ఒక‌ మ‌గాడికి ఓ రెజ్ల‌ర్ భార్య‌గా వ‌స్తే అత‌నెలాంటి ఇబ్బందులు ప‌డ‌తాడో వినోదాత్మ‌కంగా చూపించారు ద‌ర్శ‌కుడు. భార్య‌ల్ని అదుపులో ఎలా పెట్టాలి అని మ‌గాళ్లు.. భ‌ర్తల్ని ఎలా చెప్పుచేత‌ల్లో పెట్టుకోవాల‌ని భార్య‌లు కూర్చొని మాట్లాడుకునే స‌న్నివేశాలు కావాల్సినంత వినోదాన్ని పంచిస్తాయి. విరామానికి ముందు ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో కీర్తిలో అస‌లు కోణం బ‌య‌ట ప‌డ‌టం.. అది చూసి వీరా కంగు తిన‌డంతో ద్వితీయార్ధం ఏం జ‌రుగుతుందా? అన్న ఆస‌క్తి మొద‌ల‌వుతుంది.

ఇక త‌న భార్య ఓ రెజ్ల‌ర్ అని తెలిశాక వీరా ప్ర‌వ‌ర్త‌న‌లో వ‌చ్చే మార్పు.. ఊర్లో వాళ్ల నుంచి అత‌డికి ఎదుర‌య్యే అనుభ‌వాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. భార్యపై గెలిచి పైచేయి సాధించేందుకు వీరా మ‌ట్టికుస్తీ పోటీలో త‌ల‌ప‌డాల‌నుకోవ‌డం.. 15 రోజుల్లోనే ఆ ఆట నేర్చుకొని బ‌రిలో దిగ‌డం మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్లుగానే ఉన్నా ఆక‌ట్టుకుంటాయి.

యాక్టింగ్ ఎలా ఉందంటే.. : సినిమాలో విష్ణు విశాల్ క‌థానాయ‌కుడైనా.. అస‌లైన హీరోయిజమంతా ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ పాత్ర‌లోనే క‌నిపిస్తుంది. ఓవైపు భ‌ర్త‌కు నిజం తెలియ‌నీయ‌కుండా భ‌య‌ప‌డుతూ బ‌తికే గృహిణిగా.. వీర వనిత‌గా రెండు కోణాల్లోనూ అద‌ర‌గొట్టింది ఐశ్వ‌ర్య‌. వీరా పాత్ర‌కు విష్ణు విశాల్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. నాయికా ప్రాధాన్య క‌థ‌లా క‌నిపించినా.. క‌థ‌ను న‌మ్మి ఆ పాత్ర చేసేందుకు ముందుకొచ్చిన అత‌డి ప్ర‌య‌త్నాన్ని అభినందించాలి. హీరో మామ‌య్య‌, హీరోయిన్ బాబాయ్ పాత్ర‌లు కాల‌క్షేపాన్నిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో తొలి 20నిమిషాలు కాస్త సాగ‌తీత‌గా అనిపిస్తాయి. తెలుగు డ‌బ్బింగ్ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ పెట్టాల్సింది. పాట‌లు ఏమాత్రం ఆక‌ట్టుకోవు. త‌మిళ నేటివిటీ కాస్త ఇబ్బంది పెడుతుంది.

చిత్రం: మట్టికుస్తీ;

నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, శ్రీజా రవి, అజయ్, శత్రు, మునీష్‌కాంత్, కాళీ వెంకట్, రిడిన్ కింగ్ స్లే, హరీష్ పేరడీ తదితరులు; సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్; సంగీతం: జస్టిన్ ప్రభాకరన్; నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్; రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు

కన్‌క్లూజన్‌ : న‌వ్వించే భార్యాభ‌ర్త‌ల కుస్తీ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here