Mangalavaram : ‘మంగళవారం’ మూవీ ఫుల్ రివ్యూ..ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఈమధ్య కాలం లో రాలేదు!నటీనటులు : పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేతా , రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, దివ్య పిళ్ళై, లక్ష్మణ్ తదితరులు.

రచన, దర్శకత్వం : అజయ్ భూపతి
నిర్మాతలు : స్వాతి రెడ్డి గనుపాటి , అజయ్ భూపతి
సంగీతం : అజనీష్ లోకనాధ్
సినిమాటోగ్రఫీ : శివేంద్ర దాశరధి
ఎడిటింగ్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి

Mangalavaram : ఈ మధ్య కాలం లో ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘మంగళవారం’. ‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ట్రైలర్ తోనే ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ముఖ్య అతిథిగా పిలిచాడు. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడిన మాటలు సినిమా పై ఇంకా అంచనాలు పెంచేలా చేసింది. డైరెక్టర్, హీరోయిన్ మరియు మిగిలిన నటీ నటులు ఇలా అందరూ కూడా ప్రొమోషన్స్ లో ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టి ఆడియన్స్ ని ఈ చిత్రం కోసం ఎదురు చూసేలా చేసారు. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

1986 నుండి 1996 మధ్యలో మహాలక్ష్మి పురం అనే గ్రామం లో జరిగిన కథ ఇది. ఈ ఊర్లో ఒక ఆడ, ఒక మగ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే, వారి పేర్లు గోడ మీద రాసి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి దేవి కి ఎంతో ఇష్టమైన ప్రతీ మంగళవారం ఈ అనుమానాస్పద ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి ఆత్మహత్యలు కాదు, హత్యలు అని ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా (నందిత శ్వేతా) చెప్తుంది. ఒక్కసారి పోస్ట్ మార్టం కి మృతదేహాలను ఇవ్వాల్సిందిగా కోరగా ఆ ఊరి జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ ) అందుకు ఒప్పుకోడు. ఆ మరుసటి మంగళవారం రోజు కూడా ఇలాగే రెండు హత్యలు జరుగుతాయి. అప్పుడు మీనా ఊర్లో వాళ్లందరినీ ఒప్పించి మృతదేహాలను పోస్ట్ మార్టం కి తీసుకెళ్తుంది. మరి ఈ ఆత్మహత్యల వెనుక అసలు నిజం ఏమిటో ఎస్ ఐ మీనా కనుక్కుందా?, ఈ ఆత్మహత్యలకు మరియు ఈ ఊరి నుండి వెలివేయబడ్డ శైలజ (పాయల్ రాజ్ పుత్) కి ఉన్న సంబంధం ఏమిటి?, అసలు ఆమెని ఎందుకు ఈ ఊరి నుండి వెలివేసాడు?, ఈ హత్యలు చేస్తున్నది ఎవరు ?, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమా ప్రారంభం నుండి అద్భుతమైన స్టోరీ సెటప్ తో ప్రేక్షకులను కథలోకి లీనం అయ్యేలా చేసాడు. ప్రథమార్థం మొత్తం సస్పెన్స్ తో, అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ తో, అద్భుతమైన ఇంటర్వెల్ బ్లాక్ తో ముగుస్తుంది. ఆడియన్స్ కి ఇంటర్వెల్ సన్నివేశం వచ్చినప్పుడు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఒక సెన్సిటివ్ అంశాన్ని బోల్డ్ గా చూపిస్తూ, సందేశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఐదిరిపోయినప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం ప్రారంభం లో కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. కానీ చివరి 40 నిముషాలు మాత్రం ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం అనే చెప్పాలి. కచ్చితంగా థియేటర్స్ లో చూస్తే కానీ అనుభూతి పొందని సన్నివేశాలు అవి. ఆ రేంజ్ లో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ని నడిపించాడు.

ఇక ఈ చిత్రం లో నటించిన నటీనటుల గురించి చెప్పుకోవాల్సి వస్తే పాయల్ రాజ్ పుత్ కి ఈ చిత్రం తన కెరీర్ కి ఒక పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆమె చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అటు నటిగా కూడా తనని తానూ నిరూపించుకునే పాత్రలు దక్కలేదు. కానీ మంగళవారం చిత్రం మాత్రం ఆమెలోని నటిని మరోసారి బయటకి తీసింది. ఇక ఎస్ ఐ పాత్రలో నటించిన నందిత శ్వేతా తన మార్క్ చూపించింది కానీ, నటన కి పెద్దగా స్కోప్ లేని పాత్ర అది. ఇక ఫస్ట్ హాఫ్ లో అజయ్ ఘోష్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్విస్తాయి. ‘బెదురులంక’ చిత్రం తర్వాత అజయ్ ఘోష్ కి మరో గుర్తుండిపోయే పాత్ర పడింది అనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రం లో మాస్క్ వేసుకొని నటించిన నటుడు ఎవరో మీరే సినిమా చూసి తెలుసుకోండి, అది సస్పెన్స్ . ఇక మిగిలిన నటీనటులు రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

చివరిమాట :

సస్పెన్స్ థ్రిల్లెర్స్ ని అమితంగా సిఆటపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కనుల పండుగే అని చెప్పొచ్చు. కచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. మరో ఆలోచన పెట్టుకోకుండా ఈ వీకెండ్ కి టికెట్స్ బుక్ చేసేసుకోండి.

రేటింగ్ : 3.5 /5

Tags: