Manchu Manoj : మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ గేమ్ షో ‘ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం’. డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది. తాజాగా ఈ షో ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న మంచు మనోజ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులు తనకు ఎప్పుడూ అండగా నిలిచారని.. ఏడేళ్లు విరామం తీసుకున్నందుకు క్షమించాలని కోరారు.
‘‘ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా. ఈ విరామంలో నేను మరో జీవితాన్ని చూశా. గతంలో సినిమాలు చేసేటప్పుడు ఒక అభిరుచి, లక్ష్యంతో చేసేవాడిని. గ్యాప్ తీసుకున్నప్పటికీ అభిమానులు నాపై చూపించిన ప్రేమాభిమానాలను బాధ్యతగా తీసుకుని రీఎంట్రీ ఇస్తున్నా. ఇన్నేళ్లలో నాకు ధైర్యంగా నిలిచింది వాళ్లే. మౌనికతో ప్రేమలో పడిన తర్వాతే.. అభిమానులు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో అర్థమైంది. సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నందుకు నన్ను క్షమించాలి. ఇకపై వినోదం మరోస్థాయిలో ఉండనుంది. ఈ గేమ్ షోతో నాకు మంచి టీమ్ దొరికింది. అందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నా.
నితిన్, సాయి కృష్ణ, సాయికిరణ్.. ఇలా ప్రతి ఒక్కరూ ఈషోను అద్భుతంగా తీర్చిదిద్దడంలో మాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఈ షో కోసం నన్ను సంప్రదించినప్పుడు.. కాన్సెప్ట్ ఏమిటని అడిగాను. వాళ్లు చెప్పిన కాన్సెప్ట్ విని నాకు సంతోషంగా అనిపించింది. ఇదొక సెలబ్రిటీ గేమ్ షో. తమని ఎంతగానో అభిమానించే ఫ్యాన్ కోసం ఒక సెలబ్రిటీ ఆడే ఆట ఇది. ఈ ఆటలో సెలబ్రిటీ గెలుచుకున్న మొత్తాన్ని ఆ అభిమానికి ఇచ్చేస్తాం. అదే ఈ షో స్పెషాలిటీ. ప్రైజ్ మనీ వచ్చేసి.. రూ.50 లక్షలు, స్పెషల్ గిఫ్ట్‌లు కూడా ఉంటాయి’’ అని ఆయన తెలిపారు. ఏడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నా అని మంచు మనోజ్ చెప్పగానే సభా ప్రాంగణంలో ఉన్న ఆయన సతీమణి మౌనిక భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మాటలకు ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.