Jagapathi Babu : ఒకప్పుడు జగపతిబాబు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. ఒకానొక సందర్భంలో ఆయనకు సినిమాలు కూడా కరువైపోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమా ఆయనలో ఉన్న విలనజాన్ని బయటపెట్టింది. నందమూరి బాలకృష్ణకి పవర్ఫుల్ విలన్ గా నిలబడిన జగపతిబాబుకి లెజెండ్ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశాన్ని కలిగించింది. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు.

అందులో ఒక చిన్న పార్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన జగపతిబాబు తాను డబ్బున్న పేదవాడినని, లెజెండ్ లాంటి అవకాశాలు ఇంకా కావాలని క్యాప్షన్ పెట్టారు. ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా తనకు చిన్న సినిమాలు ఎక్కువ చేయాలని ఉందని జగపతిబాబు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వాళ్లు చాలా కమిటెడ్ గా కొత్తగా చేస్తున్నారని అన్నారు. ఇక తన బ్యాడ్ ఏంటంటే నేను పూర్ రిచ్ మాన్ అని అన్నారు. ఆ లిస్టులో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కానీ ఆ సినిమాలు జరగడం లేదు అన్నారు.
‘ఆ సినిమాలు షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఉన్నాయి కదా అని నేను వేరే సినిమాలు ఒప్పుకోవడం లేదు. . కొందరైతే జగపతిబాబు అమ్మో పెద్దపెద్ద సినిమాలు చేస్తున్నాడు, అని నన్ను అడగడానికి కూడా సాహసం చేయడం లేదు. నేను ఒప్పుకున్న సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల నాకు ఉన్న సినిమాలు ఊడిపోతున్నాయి.
చిన్నవాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నారు జగపతిబాబు అయిపోయాడు, జగపతిబాబు పనైపోయింది అని. లెజెండ్ రావడానికి రెండు నెలలు ముందు వరకు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ లెజెండ్ సినిమా వచ్చింది మళ్ళీ నిలబడ్డాను, 90 సినిమాలు చేశాను. నేను చెప్పేది ఏంటంటే నేను పోయినట్టే పోతాను కానీ మళ్ళీ వస్తాను, సినిమాలు చేస్తూనే ఉంటాను. కానీ నాకు లెజెండ్ విజయాన్ని ఉపయోగించుకోవడం రాలేదు. ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా’ అంటూ కామెంట్ చేశారు.