హీరో Siddharth ప్రధాన పాత్ర పోషించిన చిత్తా తమిళ సినిమా గతేడాది వచ్చి ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో చిన్నా పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే, తెలుగులో ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అప్పట్లో సిద్ధార్థ్ జోరుగా ప్రచారం చేసినా.. చిన్నా ఆశించిన విధంగా కలెక్షన్లను రాబట్టలేదు. కాగా, తాజాగా జేఎఫ్డబ్ల్యూ ఈవెంట్కు హాజరైన సిద్ధార్థ్ తన సినిమాపై వచ్చిన కామెంట్లకు స్పందించారు. ఈ క్రమంలో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీపై కాస్త విమర్శనాత్మకంగా మాట్లాడారు. చిన్నారులపై వేధింపుల అంశంపై చిన్నా సినిమా తెరకెక్కింది.

అయితే, చిన్నా చిత్రం తమకు ఇబ్బందిగా అనిపించిందని తనకు కొందరు పురుషులు చెప్పారని సిద్ధార్థ్ అన్నారు. కానీ అలాంటి వారే యానిమల్ సినిమా చూడగలిగారని సిద్ధార్థ్ చెప్పారు. చిన్నా సినిమా ఇబ్బందికరంగా ఉందని తనకు మహిళలు ఎవరూ చెప్పలేదని, కొందరు పురుషులు చెప్పారని సిద్ధార్థ్ అన్నారు. “చిన్నా సినిమా ఇబ్బందికరంగా ఉందని, చూడలేకపోయామని ఏ మహిళ కూడా నాకు కానీ, అరుణ్ (చిన్నా డైరెక్టర్)కు కానీ చెప్పలేదు.
కానీ చాలా మంది పురుషులు నాకు అలా చెప్పారు. అలాంటి సినిమాలు చూడలేమని వారు నాతో అన్నారు. కానీ వాళ్లు మృగం (యానిమల్ తమిళ వెర్షన్) సినిమా చూస్తారు. కానీ వారికి నా సినిమాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. అది ఇబ్బంది కాదు.. సిగ్గు, అపరాధ భావం. ఓకే. కానీ త్వరలోనే అది మారుతుంది” అని సిద్ధార్థ్ అన్నారు. గతేడాది చిన్నా రిలీజ్కు ముందు నిర్వహించిన ప్రెస్మీట్లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు.
తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నామని, కానీ తన చిత్రాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని మాట్లాడారని తెలిపారు. ఎట్టకేలకు ఏషియన్ ఫిల్మ్స్ తెలుగులో రిలీజ్ చేసింది. గతేడాది అక్టోబర్ 6న చిన్నా విడుదలైంది. అయితే, అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాలేదు.