తెలంగాణలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో.. కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కీలక సమాచారం బయటపడింది. ఆయన ఫోన్ డేటాతో పాటు గూగుల్ డ్రైవ్ డేటాను సేకరించగా.. అందులో చాలా మంది సెలెబ్రెటీలు, రాజకీయ నేతల బండారం బయటపడ్డట్టు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనని కూడా చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమని కొందరు బలవంతం పెట్టారని అయితే, అలాంటి వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉందని, దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అన్నారు. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దని కోరారు. త్వరలోనే మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత నిఖిల్ 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ను చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన స్పై అనే మరో ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోంది. ఈ సినిమా జూన్ 29న విడుదలకానుందని ప్రకటించింది టీమ్. విడుదలకు దగ్గరపడుతుండడంతో ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అంతేకాదు ఈ సినిమా నిడివి కూడా చాలా తక్కువుగా ఉంది. ఈ సినిమా 135 నిమిషాలు మాత్రమే ఉండనుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.