Abbas.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. అదే 90ల్లో పుట్టి, ఇప్పుడు కుర్రాళ్లుగా ఉన్నవాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ‘ప్రేమదేశం’ చూసి అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. అతడిలా ఉండటానికి ట్రై చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన అబ్బాస్.. కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరమైపోయాడు. మళ్లీ ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో దర్శనమిచ్చాడు. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు.
10 గ్రేడ్ ఫెయిలైనప్పుడు నాకూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరంకావడంతో సూసైడ్ ఆలోచన బలపడింది. కానీ, దాన్నుంచి నేను బయటపడగలిగా. ఓసారి రోడ్డు పక్కన నిల్చొని.. వేగంగా వస్తున్న వాహనం ముందుకు వెళ్లాలనుకున్నా. ఆ డ్రైవర్ గురించి ఆలోచించి ఆగిపోయా. ఎందుకంటే.. నేను తీసుకున్న నిర్ణయం వల్ల అతడి జీవితంపై ప్రభావం పడుతుంది. కష్ట సమయంలోనూ ఇతరుల శ్రేయస్సును కోరుకునే మనస్తత్వం అలవరచుకున్నా. ఈ విషయాన్నే కొవిడ్ సమయంలో నా అభిమానులతో పంచుకున్నట్లు అని తెలిపాడు.
అనుకోకుండానే నేను నటుడినయ్యా. సాధారణ ప్రేక్షకుడిలానే నా తొలి చిత్రం ‘కాదల్ దేశం’ (ప్రేమదేశం) ప్రీమియర్‌కి వెళ్లా. మరుసటి రోజు మా ఇంటి ముందు సముద్రాన్ని తలపించే అభిమానగణాన్ని చూసి ఆశ్చర్యపోయా. వారెందుకు నాపై అంత ప్రేమ కురిపించారో అప్పుడు నాకర్థంకాలేదు. 19 ఏళ్ల వయసులో డబ్బు సంపాదించేందుకు సినిమాని ఓ మార్గంగా ఎంపిక చేసుకున్నా. కెరీర్ ప్రారంభంలో విజయాలు అందుకున్నా. తర్వాత ఫెయిల్యూర్‌నీ చూశా. కనీస అవసరాలకూ డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. అవకాశం కోసం నిర్మాత ఆర్.బి. చౌదరిని కలిశా. ‘పూవెలి’ చిత్రంలో నటించమన్నారు. కొన్నాళ్లకు నా పనిని (నటన) నేను ఆస్వాదించలేకపోయా. బోర్ కొట్టేసింది. అందుకే సినిమాలకు దూరమయ్యా. న్యూజిలాండ్ వెళ్లా. కుటుంబాన్ని పోషించేందుకు బైక్ మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గాను పనిచేశా అని అబ్బాస్ చెప్పారు.