Gautham Weds Manjima : పెళ్లిబంధంతో ఒక్కటైన కోలీవుడ్ లవ్​బర్డ్స్



Gautham Weds Manjima : కోలీవుడ్‌ లవ్ బర్డ్స్ గౌతమ్ కార్తీక్- మంజిమా మోహన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో సోమవారం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని యువ జంటను అభినందించారు. పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న ఈ జోడీకి సంబంధించిన ఓ ఫొటో బయటకు రావడంతో అభిమానులు కంగ్రాట్స్‌ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోతోన్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Gautham Weds ManjimaGautham Weds Manjima

అభినందన, అన్వేషణ తదితర సినిమాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తీక్‌ వారసుడే గౌతమ్‌ కార్తీక్‌. మణిరత్నం తెరకెక్కించిన కాదల్‌ (తెలుగులో కడలి) తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారం అందుకున్నాడు. ఇక మంజిమా మోహన్‌ విషయానికొస్తే.. తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించింది. ఇందులో చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కొన్ని నెలల క్రితం విష్ణు విశాల్‌ ఎఫ్‌ఐఆర్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించింది.

Gautham Weds Manjima Mohan

‘దేవరట్టం’ సినిమా కోసం మంజిమ-గౌతమ్‌ కలిసి పనిచేశారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టారు. తనే మొదట ఆమెకు ప్రపోజ్‌ చేశానని ఇటీవల గౌతమ్‌ తెలిపారు. సుమారు మూడేళ్ల నుంచి వీరు ప్రేమలో ఉన్నారు. పెద్దలు అంగీకరించడంతో నేడు వివాహం చేసుకున్నారు. అయితే తమది అంత గొప్ప ప్రేమేం కాదని చెప్పాడు కార్తీక్. ఐలవ్యూ చెప్పిన వెంటనే మంజిమ తనకు ఓకే చెప్పలేదని అన్నాడు.

‘‘జీవితంలోకి సరైన వ్యక్తి వచ్చినప్పుడే మనం మంచి మనిషిగా ఎదుగుతాం’ అని నాన్న నాకెప్పుడూ చెబుతూ ఉండేవారు. అలా నా జీవితానికి సరైన వ్యక్తి మంజిమ. తను అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన వ్యక్తి. ధైర్యవంతురాలు. నేనెప్పుడు నిరాశ, ఆందోళనకు గురైనా.. తనే నా వెంట ఉండేది. దేవరట్టంసినిమా సమయంలో మేమిద్దరం మంచి స్నేహితులుగా మరాం. ఏడాది పాటు స్నేహితులుగానే ఉన్నాం. ఆమెతో రిలేషన్‌ కొనసాగించాలని అనిపించింది. వెంటనే ఆమెకు ప్రపోజ్‌ చేశా. రెండ్రోజుల వరకు తను ఎస్‌ చెప్పలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఇటీవల నిర్ణయించుకున్నాం. మా నిర్ణయంతో ఇరు కుటుంబంలోని పెద్దలు ఆనందంగా ఉన్నారు’’ అని గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.