Mokshagna : నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ వెండితెర ఆరంగేట్రం పై చాలాకాలంగా ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్‌కు వెళ్లిన బాలయ్య సైతం త్వరలో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే కథా చర్చలు జరుపుతున్నట్లు, త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ వస్తుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఐతే మోక్షజ్ఞ ఎంట్రీపై ఆయన కుటుంబంలోనే ఓ కన్ఫ్యూజన్ ఉందట. మోక్షజ్ఞ నటించే సినిమాకు నిర్మాతగా ఎవరు ఉండాలన్నదే తేల్చుకోలేకపోతున్నారట ఆయన కుటుంబ సభ్యులు.
టాలీవుడ్ ఇండస్ట్రీతో నందమూరి కుటుంబానికి దాదారు అరవై ఏళ్ల అనుబంధం ఉంది. మహానటుడు ఎన్టీఆర్ నటవారసత్వం అందిపుచ్చుకుని ఆయన కుటుంబంలో ఎందరో స్టార్ హీరోలు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఇప్పుడు మరో హీరో వెండితెర పై ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధమైంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సిని ఎంట్రీకి అంతా సిద్ధం అయింది. త్వరలో సెట్స్‌పైకి వచ్చే మోక్షజ్ఞ సినిమా కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మోక్షజ్ఞతో సినిమా చేసే విషయంలో బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు పోటీ పడుతున్నారని సమాచారం. తమ ముద్దుల తమ్ముడి మొదటి సినిమా నిర్మాత బాధ్యతలు తనకి కావాలంటే తనకే కావాలని ఆయన ఇద్దరు బిడ్డలు బ్రాహ్మణి, తేజశ్విని పోటీపడుతున్నారట.
బాలకృష్ణ పిల్లల్లో చిన్నకుమార్తె తేజశ్వినికి మాత్రమే ప్రస్తుతం ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. బాలకృష్ణ సినిమా వ్యవహారాలు ఆమె పర్యవేక్షిస్తుంటారు. దీంతో తమ్ముడు మోక్షజ్ఞ సినిమాను తాను నిర్మిస్తానని గట్టి పట్టుదలతో ఉన్నారట తేజశ్విని. ఐతే ఆ అవకాశం తనకే ఇవ్వాలని తండ్రి వద్ద పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తన తమ్ముడి తొలి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటుందట బ్రాహ్మణి. ప్రస్తుతం హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న బ్రాహ్మణి సినీ నిర్మాతగా మారతానంటుండటం.. ఇంకో కుమార్తె కూడా నిర్మాణానికి ఆసక్తి చూపిస్తుండడంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారట బాలకృష్ణ. ఇద్దరు అక్కలు.. తమ తమ్ముడి కోసం నిర్మాతగా మారతానంటుండడంతో.. అంతా బాలయ్య నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారట. ప్రస్తుతానికి కథా చర్చలు, డైరెక్టర్ ఎంపికపై ఫోకస్ చేసిన బాలయ్య బాబు.. నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాలి.