Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి సందడి చేయడానికి జనవరి 13న వస్తున్నారు. ప్రస్తుతం చిరు వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పలు వార్తా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఛానెల్ కు చిరు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాల్తేరు వీరయ్య సినిమాలు విశేషాలతో పాటు చాలా ఏళ్లుగా చిరంజీవిపై ఉన్న పుకార్లు, వివాదాల గురించి మాట్లాడారు.
టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ జైలు పాలు కావడానికి చిరంజీవీయే కారణం. చిరు పుట్టిన ఊరు మొగల్తూరుకు లైబ్రరీ కోసం స్థలం ఇవ్వమంటే రూ.3 లక్షలకు అమ్ముకున్నారు.. అడిగిన వాళ్లపై కోప్పడ్డారు. తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంలో చిరంజీవి తోడుంటారా.. అసలు పవన్ రాజకీయ ప్రయాణంతో సంబంధం లేకుండా అంటీ ముట్టకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు.. ఇలాంటి వివాదాస్పద విషయాలపై ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి సమాధానం ఇచ్చారు.
“మొదట మొగల్తూరులో లైబ్రరీ స్థల వివాదంపై చిరంజీవి మాట్లాడుతూ.. ఇలాంటి వాటికి సమాధానం చెప్పడం నాకే ఇబ్బందిగా ఉంది. వాళ్ల అవసరం కోసం.. మనిషిని ఎంతైనా దిగజార్చుతారా? లేని మచ్చ వేయాలనిచూస్తారా? బురద చల్లాలనే ప్రయత్నంలోనే వచ్చిన ఆరోపణలు ఇవి. మొగల్తూరులో ఉన్న ఆ ఇంటి స్థలం నాది కాదు.. మా మమయ్య శ్రీనివాసులుది. మా అమ్మమ్మ గారి తమ్ముడిది. ఆయనది నేను ఎలా ఇస్తాను. మా నాన్న గారి సంపాదన కూడా కాదు. అమ్మ గారి నాన్నది.. అది ఆయన కొడుకుకి ఇచ్చుకున్నారు. కేవలం నేను అక్కడ ఉన్నానని అది నా ఆస్తి అయిపోతుందా? మా మామయ్య గారి పేరు మీద ఉన్నది నేను ఎలా అమ్ముకుంటాను.”
“ఆ పుకార్లు ఎవరు పెట్టారో ఏమో తెలియదు కానీ.. నేనూ విన్నాను. లైబ్రరీకి ఇల్లు ఎలా ఇస్తారు. ఒకవేళ కావాలంటే నేను డొనేట్ చేసేవాడిని. నా స్నేహితుడు సత్య ప్రసాద్ నేతృత్వంలో మొగల్తూరులో నేను ఒక లైబ్రరీ కట్టించాను. అక్కడ లైబ్రరీ ఉంది. ఇలాంటి పుకార్లు విన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయంలో నాకు సంబంధమే లేదు. నా ఇల్లే కాదు. కానీ నాపై బురదచల్లారు.” అని చిరు క్లారిటీ ఇచ్చారు.
“సుమన్ జైలు పాలైనప్పుడు కూడా.. నాపై బురదచల్లారు. ఆరోపణలు చేశారు. ఛీ.. ఛీ.. చీ.. ఇలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను సుమన్ మంచి స్నేహితులం. మధ్యలో ఎవడో పోరంబోకు జర్నలిస్ట్.. ఏదో రాశాడు. పోరంబోకు అనే మాట హార్ష్‌గా ఉండొచ్చు కానీ.. వాడు ఏదో రాశాడా.. రాసిన దాన్ని వక్రీకరించాడో కానీ.. ఇప్పటికి వందలసార్లు సుమన్ ఏం లేదని చెప్పాడు. ఆయనకి నాకు ఎలాంటి విరోధం లేదు.. ఇప్పటికీ మేం మాట్లాడుకుంటాం. కానీ వీళ్లు మాత్రం శాడిస్ట్‌లా మాట్లాడుతుంటారు. పదే పదే ఇవే విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వాటిపై మాట్లాడుకోవడం సిగ్గచేటు. ఏ తప్పు చేయని వాడిపై ఆరోపణలు చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. నా నుంచి ఎవరూ ఏ తప్పు పట్టలేరు” అంటూ తనపై వచ్చిన తప్పుడు ప్రచారంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు చిరంజీవి.
పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై చిరంజీవి స్పందిస్తూ.. “ఒక అన్నగా నా తమ్ముడికి ఎప్పుడూ అండగా ఉంటాను. కానీ నేను రాజకీయాలు చేయను.” అని క్లారిటీ ఇచ్చారు.