Chiranjeevi : నందమూరి తారక రామారావు తనకు అప్పట్లో ఇచ్చిన ఓ సలహాను మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా విశాఖపట్టణంలో నేడు (జనవరి 20) లోక్‍నాయక్ ఫౌండేషన్ ఆధ్వరంలో అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కార్లు కొనాలని ఆశ పడ్డానని చిరంజీవి చెప్పారు. అయితే, భూములపై పెట్టుబడి పెట్టాలని ఎన్టీఆర్ సలహా ఇచ్చారని చిరూ తెలిపారు. ఆ సలహాతో తాను భూములు కొన్నానని, అవి తమ కుటుంబాన్ని కాపాడుతున్నాయని మెగాస్టార్ అన్నారు.

“బ్రదర్ మీరు అభివృద్ధిలోకి వస్తున్నారని.. సంపాదించిన సంపద ఇనుప ముక్కల మీద పెట్టవద్దని నాకు ఎన్టీఆర్ చెప్పారు. ముందుగా ఇల్లు కట్టుకోండి.. ఆ తర్వాత స్థలాల మీద పెట్టండని చెప్పారు. మనం ఎక్కువ కాలం ఇలాగే సూపర్ స్టార్లలా ఉండం.. ఇది శాశ్వతమనుకోవద్దని ఎంతో జాగ్రత్త.. ముందు చూపుతో ఆయన సలహాలు ఇచ్చారు. అప్పటి దాకా నాకు మంచి లగ్జరీ కార్లు కొనాలని ఉండేది. దాన్ని నేను ఆపేసి అక్కడక్కడా స్థలాలు కొనడం మొదలుపెట్టా. ఈరోజున నా రెమ్యూనరేషన్ కంటే కూడా ఆ స్థలాలే నన్ను నా ఫ్యామిలీని కాపుడుతున్నాయి. దూరదృష్టితో అలాంటి గొప్ప సలహాలు ఇచ్చారు.

నేను స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన మేధా సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్‌కు సోపానాలు అయ్యాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ‘అభిలాష’ నవల గురించి నాకు మొదట మా అమ్మ చెప్పింది. అదే నవలను కేఎస్ రామారావుగారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చాయి. కెరీర్‌లో నేను సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ‘ఛాలెంజ్’ ఎంతో మంది యువతను ప్రభావితం చేసింది. నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి వీరేంద్రనాథ్ రచనలదే. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం నిజంగా సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి అన్నారు.