Vijayashanti : భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బింబిసారతో భారీ హిట్ అందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. మరో కీలకపాత్రలో అనుష్క శెట్టి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ సమాచారం మేరకు మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్, నటి, రాజకీయవేత్త విజయశాంతి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటికే విజయశాంతిని కలిసి, తన పాత్ర గురించి వివరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో క్లారిటీ రానుంది. గతంలో చిరంజీవి, విజయశాంతి కలయికలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ కుదిరితే విశ్వంభర కు ప్లస్ అవుతుందని భావిస్తున్నాయి సినీ వర్గాలు.

ఇదే జరిగితే దాదాపు 30ఏళ్ల తర్వాత తమ అభిమాన జోడీని తెరపై చూసుకోనున్నారు వారి ఫ్యాన్స్. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. మేము అయితే థియేటర్ లో ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఎంజాయ్ చేసేందుకు రెడీ అంటున్నారు అభిమానులు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా విడుదల తేది విషయంలో తాజాగా టీమ్ ఓ ప్రకటన చేసింది. ఈసినిమా 2025 జనవరి 10న విడుదలకానుందని టీం అఫీషియల్ గా ప్రకటించింది. అదిరే గ్రాఫిక్స్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు అపజయమే ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడితో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఎంటర్టైనింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత ప్రభుత్వం చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ విభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పద్మ భూషణ్ వరించగా.. లేటెస్ట్‌గా పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది.