Balakrishna And Chiranjeevi : సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడి పందేలు.. కానీ అంతకంటే ముందు మన మదిలో మెదిలేది సినిమాలు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అగ్రహీరోలు థియేటర్ ల వద్ద క్యూ కడుతుంటారు. చాలాసార్లు సీనియర్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ ను షేకాడించాయి. అలా ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నందిమూరి బాలకృష్ణ కలిసి వస్తున్నారు.
వీరసింహారెడ్డిగా బాలయ్య.. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి థియేటర్ లో ఈ పండుగ పూట పోటీ పడుతున్నారు. అయితే ఇలా సంక్రాంతి పండుగ పూట బాలయ్య-చిరంజీవిలు పోటీ పడటం ఇది మొదటిసారేం కాదు.. ఇప్పటి వరకు చాలా సార్లు ఈ అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదలై సూపర్ హిట్, బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇప్పటివరకు ఎన్నిసార్లు సంకాంత్రి బరిలో దిగారు? ఆ చిత్రాలు ఏంటో ఓసారి చూద్దామా..?
2023లో చిరు బాలయ్య సినిమాలు
12న వీరసింహారెడ్డి.. 13కి వాల్తేరు వీరయ్య!.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతిహాసన్ జంటగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇక చిరంజీవి హీరోగా దర్శకుడు కె. బాబీ డైరెక్షన్లో వస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలోనూ శ్రుతిహాసన్ కథానాయికగా కనిపించడం విశేషం. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరంజీవి ‘పోరాటం’.. బాలయ్య ‘బలం’.. చిరంజీవి, బాలకృష్ణ మొదటిసారి సంక్రాంతి రేసులో నిలిచిన సంవత్సరం 1985. 1985 జనవరి 11న విడుదలైన ‘చట్టంతో పోరాటం’లో చిరు హీరోగా నటించగా కె. బాపయ్య దర్శకత్వం వహిరించారు. ఇక అదే ఏడాది జనవరి 11న తాతినేని ప్రసాద్ తెరక్కెక్కించిన సినిమా ‘ఆత్మబలం’. ఇందులో బాలకృష్ణ నటుడిగా మెప్పించగా నటి భానుప్రియ తన అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఇటు దొంగోడు..అటు భార్గవుడు.. 1987లో కూడా సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు ఆడియన్స్‌ను అలరించారు. చిరంజీవి ‘దొంగమొగుడు’ సినిమా జనవరి 9న విడుదల కాగా, ‘భార్గవరాముడు’తో బాలకృష్ణ జనవరి 14న ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకుడు కావడం విశేషం.
చిరు దొంగ.. బాలయ్య పోలీసు!.. 1988 సంక్రాంతి పందెంలోనూ చిరు, బాలయ్యల చిత్రాలు సందడి చేశాయి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మంచిదొంగ’ జనవరి 14న రిలీజ్ అవ్వగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఇన్‌స్పెక్టర్ ప్రతాప్’ మూవీ జనవరి 15న రిలీజ్ అయ్యింది.
సెంటిమెంట్‌తో చంపేశారు!.. చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ‘హిట్లర్’, దర్శకుడు శరత్ డైరెక్షన్లో బాలకృష్ణ నటించిన ‘పెద్దన్నయ్య’ సినిమాలు 1997లో జనవరి 4న సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఈ రెండింటిలో ఇద్దరూ అన్నయ్య రోల్లో యాక్ట్ చేశారు.
1999 జనవరిలోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ కనిపించింది. చిరు నటించిన ‘స్నేహంకోసం’ సినిమా ఆ సంవత్సరం జనవరి 1న విడుదలైంది. డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ దీన్ని తెరక్కెక్కించారు. బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ జనవరి 13న విడుదలైంది.
అప్పటి వరకూ రోజుల తేడాతో పొంగల్ సీజన్‌కు చిరు, బాలయ్యల సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ, 2001లో మాత్రం ఈ స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. ‘నరసింహనాయుడు’తో బాలకృష్ణ, ‘మృగరాజు’తో చిరంజీవి జనవరి 11న అలరించారు.
దర్శకుడు జయంత్ సి. పరాన్జీ బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా ‘లక్ష్మీనరసింహా’. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అంజి’. ఈ రెండు 2004లో సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి.
చిరుకి 150.. బాలయ్యకి 100!.. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న చిరు లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150 సినిమాతో ఇండస్ట్రీలోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వీ.వీ.వినాయక్ దర్శకత్వంలో 2017 జనవరి 11న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను తెచ్చిపెట్టింది. అదే నెల 12న విడుదలైన బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. పౌరాణిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.