Balagam Review : తెలంగాణ సంస్కృతి మీద సినిమాలు రావడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.ఎక్కడో కొన్ని సినిమాల్లో తెలంగాణ యాసని కామెడీ చేస్తూ సినిమాలు చెయ్యడం ఇదివరకు మనం చూసాము కానీ, తెలంగాణ ఎమోషన్ ని , గ్రామాల్లో ఉన్న సంప్రదాయాలను అద్దంపట్టేలా సినిమాలు ఇప్పటి వరకు అయితే రాలేదు.వచ్చినా కూడా అవి జనాలకు ఏమాత్రం రీచ్ కాలేదు.కానీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిన ‘బలగం’ అనే సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.దిల్ రాజు బ్రాండ్ కి తోడు, ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకోవడం తో ఈ చిత్రం పై అంచనాలు బాగా పెంచేలా చేసాయి.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకుడిగా మారాడు.మరి ఆయన ఈ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

కథ :
కొమురయ్య తాత(సుధాకర్ రెడ్డి) సరదాగా ఉండే మనిషి..పల్లెటూరులో ఆయన ప్రతీ ఒక్కరితో చిలిపి చేష్టలు చేస్తూ,ఆటపట్టిస్తూ ఉంటాడు.తన మనవడు సాయిలు (ప్రియదర్శి) కి పెళ్లి కుదిరిందని ఎంతో సంబరపడిపోతాడు.కానీ ఇంతలోపే కొమురయ్య తాత చనిపోతాడు.ఇది తెలుసుకున్న సాయిలు(ప్రియదర్శి) కి గుండె ఆగినంత పని అవుతాది.ఎందుకంటే అతను ఊర్లో తన పేరు మీద రాసి ఉన్న పొలాన్ని అమ్మి చిట్టీ వ్యాపారం చేస్తాడు.
అక్కడితో ఆగకుండా మరికొన్ని వ్యాపారాల్లో వేలు పెట్టి నష్టాలపాలై , లక్షల్లో అప్పులు చేస్తాడు.అప్పులోళ్ల తాకిడి పెరిగిపోతున్న సమయం లో పెళ్లి కుదురుంటుంది, 15 లక్షల రూపాయిల కట్నం కూడా ఇస్తామని చెప్తారు.ఆ డబ్బులతో అప్పు తీరుస్తానని తన అప్పులోళ్ళకి చెప్తూ ఉంటాడు సాయిలు..సరిగ్గా అలాంటి సమయం లో కొమురయ్య తాత చనిపోవడం తో నిశ్చితార్థం ఆగిపోతాది.దీనితో సాయిలు కి ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుతుంది.అదే సమయం లో సాయిలు తండ్రికి మరియు మామయ్య కి గొడవలు జరిగి పెళ్లి ఆగిపోతుంది.దీనితో అక్కడకి వచ్చిన తన మరదలు (కావ్య కళ్యాణ్ రామ్ ) ని ఎలా ప్రేమలోకి దింపి, గొడవలు సర్దుబాటు చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు సాయిలు.మరి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:
తెలంగాణ పల్లెటూరి సంప్రదాయాలను, మరియు అక్కడి ప్రజల కట్టుబాట్లను కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్ వేణు. కథలో ఫన్ తో పాటు ఎమోషన్స్ ని కూడా ఎక్కడ బ్యాలన్స్ తప్పకుండా చాలా చక్కగా వెండితెర మీద ఆవిష్కరించాడు. కథ రీత్యా స్క్రీన్ ప్లే స్లో గా ఉన్నప్పటికీ కూడా కథ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం తో ఎక్కడా బోర్ కొడుతున్నట్టు అనిపించాడు. హీరో ప్రియదర్శి క్యారక్టర్ మనల్ని ఎంతలా అయితే నవ్విస్తుందో, ఎమోషనల్ గా కూడా అంతే కనెక్ట్ చేస్తుంది. తనకి ఉన్న అప్పులు తప్ప బంధాలు అనుబంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వని పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. ఇక పాత్ర నిడివి తక్కువే అయ్యినప్పటికీ హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ పర్వాలేదు అనే రేంజ్ లో నటించింది. ఇక ఈ సినిమాకి ఆయువు పట్టులాగా నిల్చిన నటులు జయరాం మరియు శ్రీధర్ రెడ్డి. వీళ్లిద్దరి పాత్రలు సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. కథలో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఎంతో హాయిగా సాగిపోయ్యే స్క్రీన్ ప్లే తో వేణు ఈ సినిమాని మలిచిన తీరు అద్భుతం, ఇక భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి.

చివరి మాట :
వినోదం మరియు సెటిమెంట్ ఎక్కడా కూడా తగ్గకుండా తెరకెక్కిన ఈ సినిమా ప్రతీ ఒక్కరి మనసులకు కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ బిడ్డలకు మాత్రం ఈ చిత్రం పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది. ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా.
నటీనటులు : ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , వేణు టిల్లు, రచ్చ రవి, సుధాకర్ రెడ్డి, జయరాం , మురళీ ధర్ తదితరులు
బ్యానర్ : దిల్ రాజు ప్రొడక్షన్స్
నిర్మాతలు : హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి
డైరెక్టర్ : వేణు టిల్లు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
రేటింగ్ : 3/5