Samantha : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’. ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నెలరోజులకు అక్టోబర్ 1నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అందులో ప్రసారం అవుతున్నప్పటి నుంచి టాప్ వ్యూస్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం టాప్ 10లో ఒకటిగా నిలిచింది.

ఇండియాలో ఈ వారం ఎక్కువమంది చూసిన చిత్రాల లిస్ట్‌ను తాజాగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. అందులో హిందీ భాషలో ‘ఖుషి’ టాప్7లో ఉంది. అలాగే తెలుగులో టాప్ 10లో నిలిచింది. ఇక ఈ టాప్10లో మొదటి స్థానంలో ‘డ్రీమ్‌గర్ల్2’ ఉండగా రెండులో అక్షయ్‌కుమార్ ‘ఓమైగాడ్2’ ఉంది. అలాగే నవీన్ పొలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమా టాప్ 5లో ఉంది. దీంతో అనుష్క ఏకంగా సమంతను వెనక్కు నెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’లోని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్‌ను సృష్టించాయి. ఈ చిత్రం తర్వాత సమంత ఏ సినిమాను అంగీకరించలేదు. కొన్ని నెలలు బ్రేక్ తీసుకుని ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధపెట్టారు. విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మికను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీస్టార్’లో నటిస్తున్నారు. ఇందులో ఆయన సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే దీని గ్లింప్స్‌ను విడుదల చేశారు.