Samyuktha Menon : ఏదైనా చిత్రం విజయం సాధిస్తే ఆ చిత్ర నిర్మాతలు దర్శకుడికో.. నటీనటులకో గిఫ్ట్ లు ఇస్తారు. లేదా హీరో ఆ చిత్ర టెక్నీషియన్స్ కి, దర్శకుడికి గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఇక్కడ విరూపాక్ష చిత్ర హీరోయిన్ సంయుక్త మీనన్.. తన డైరెక్టర్ కార్తీక్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిందట. ఈ విషయాన్ని సంయుక్త మీనన్ స్వయంగా వివరించింది. రీసౌండిగ్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష చిత్రంతో యువ దర్శకుడు కార్తీక్ దండు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. కార్తీక్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మిస్టరీ సస్పెన్స్ మిక్స్ చేసిన చిత్రంతో ఆడియన్స్ సీట్ ఎడ్జ్ మీద కూర్చుని ఎంజాయ్ చేసేలా విరూపాక్ష చిత్రాన్ని తీర్చిదిద్దారు.

ఫస్ట్ హాఫ్ లో కథని చూపించిన విధానం.. సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ ని అద్భుతమైన ట్విస్టులతో రివీల్ చేసిన విధానం అందిరికి తెగ నచ్చేస్తుంది. ఫలితంగా ఈ చిత్రం ఆరు రోజుల్లో దాదాపు 60 కోట్ల గ్రాస్ రాబట్టింది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అలాగే ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అయితే సంయుక్త మీనన్, దర్శకుడు కార్తీక్ మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

‘విరూపాక్ష’ విడుదల రోజు చిత్ర బృందంతో కలిసి కార్తీక్ హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో థియేటర్లో కార్తీక్ ఫోన్ పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కథానాయిక సంయుక్త వెంటనే ఐఫోన్ ప్రో మోడల్ మొబైల్‌ను కొని దర్శకుడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘సినిమా హిట్ అయిన సందర్భంగా కార్తీక్‌కు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకున్నా.
సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ పోయిందని తెలిసింది. దాంతో ఆయనకు వచ్చే ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు ఆగిపోయాయి. అందుకని వెంటనే ఫోన్ కొనిచ్చా. అయినా సిమ్ పనిచేయడానికి ఒక రోజు సమయం పట్టింది. దాంతో సోషల్ మీడియాలో సినిమా పైన ఎలాంటి చర్చ జరుగుతుందో తెలుసుకోవడానికి చిత్రబృందంలో మిగతావారి ఫోన్ల ద్వారా కార్తీక్ చూసేవారు’ అని సంయుక్త చెప్పుకొచ్చింది.