Actress Amani : అలనాటి స్టార్ హీరోయిన్లలో బ్యూటిఫుల్ ఆమని ఒకరు. సినిమాల్లో ఎంతో హోమ్లీగా కనిపించి మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌తోపాటు యూత్‌ను ఆకట్టుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ సినిమాల్లో ఆమె చేసిన పాత్రలను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. అయితే, కెరీర్‌లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన ఆమని తనకు బాగా ఇష్టమైన చిరంజీవితో కలిసి చేయకపోవడంతోపాటు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. “అందరితో నటించారు కానీ, ఒక్కరితో మాత్రం చేయలేదు” అని యాంకర్ అన్నారు.

“తెలుసు.. మీరు ఎవరి గురించి అంటున్నారో తెలుసు. మా మెగాస్టార్ చిరంజీవి గారు” అని నవ్వుతూ ఆమని బదులిచ్చారు. “మరి ఎందుకు నటించే అవకాశం రాలేదు” అని యాంకర్ అంటే.. “లేదు, వచ్చింది. అవకాశం ఎందుకు రాలేదు. వచ్చింది. నేను ఎప్పుడు దేవుడిని జపించినట్లు ఆయన్ను జపించేవాన్ని. చిరంజీవి గారంటే పిచ్చి. సినిమా అంటే ఎంత పిచ్చో చిరంజీవి అంత పిచ్చి. రొమాన్స్ సాంగ్ ఏదైనా డ్రీమ్‌లో ఆలోచిస్తే అక్కడ చిరంజీవే ఉంటారు” అని ఆమని నవ్వుతూ అన్నారు. “డ్రీమ్‌లో హీరోయిన్‌ను తీసేసి అక్కడ నేను చేస్తే ఎలా ఉండేది అని వెళ్లిపోయేదాన్ని. సో ఆయనతో నటించాలన్న డ్రీమ్ ఉండేది.
కానీ, నటించే అవకాశం దొరికింది. శుభలగ్నం తర్వాత రిక్షావోడు సినిమాకు ఫస్ట్ నన్ను అడిగారు. డేట్స్ కూడా తీసుకున్నారు. చిరంజీవి గారితో మాట్లాడాను కూడా. షూట్‌కు వెళ్తున్నాం అన్నారు. సౌందర్య గారు కూడా ఉన్నారు సినిమాలో. తను కూడా చాలా సంతోషించింది. మళ్లీ కలిసి చేస్తున్నామే అంది” అని ఆమని తెలిపారు.