Raghubabu : ప్రముఖ కమెడియన్ రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ఎన్నో వందల సినిమాలో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వెంటనే రెండు గంటల్లో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. రెండు రోజుల క్రితం నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘుబాబుపై కేసు నమోదైంది. దీంతో నల్గొండ రెండో పట్టణ పోలీసులు రఘుబాబుని అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 51 ఏళ్ల సందినేని జనార్దన్ రావు.. బీఆర్ఎన్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన కొంతమందితో కలిసి పట్టణ పరిధిలోని రిక్షా పుల్లర్స్ కాలనీ వద్ద దత్త సాయి వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం సమయంలో వెంచర్ వద్దకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు జనార్దన్ రావు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. జనార్దన్ రావు ఢివైడర్ మీద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో ఆ కారులో నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మరో కారులోకి మారారు. ఆ సమయంలో రఘుబాబుతో కొంత మంది స్థానికులు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును వారు చర్చించారు.
మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. ఆయనకి భార్య నాగమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సందినేని జనార్దన్‌రావుకు టీఆర్ఎస్ ప్రముఖ నాయకులు నివాళులర్పించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.