కొన్ని పాత్రలు సినిమా ఆసాంతం కనిపించినా పెద్దగా ప్రభావం చూపవు. కానీ, కొన్ని పాత్రలు ఒక్క సీన్‌లో కనపడినా చాలు ఆ మూవీకి ఎక్కడలేని ఆదరణ వస్తుంది. ఇటీవల ‘బ్రో’ మూవీలోని ఓ సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అంతేకాదు, రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. అదే సినీ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ పోషించిన శ్యాంబాబు పాత్ర. ఈ క్రమంలో నటుడు పృథ్వీకి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ‘శోభన్‌బాబు’ పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో ‘శ్యాంబాబు’ పాత్ర ఏకంగా రెండు గంటలు ఉంటుందట.

అయితే ఆ సినిమాకి సంబంధించిన వివరాలు మాత్రం త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. ఆ సినిమాకి దర్శకుడెవరు, హీరో ఎవరు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు,నిర్మాతల వివరాలను తాను త్వరలో చెబుతానని తెలిపారు పృథ్వీ. ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.
బ్రోచిత్రంలో శ్యాంబాబు పాత్ర నిమిషం ఐదు సెకన్లపాటు ఉంది. నేను చేయబోయే
శోభన్బాబుసినిమాలో రెండు గంటలు ఉంటుంది. నాకు అద్భుతమైన అవకాశం ఇది. ఆ రచయిత, దర్శకుడు, బ్యానర్ వివరాలు త్వరలోనే తెలియజేస్తా. అది నా కెరీర్‌ని మలుపుతిప్పే చిత్రం అవుతుంది. ఈ శ్యాంబాబుని అప్పుడు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా
అని సెల్ఫీ వీడియోని పంచుకున్నారు పృథ్వీ. దీంతో నక్కతోక తొక్కావ్ రూ.కోట్లు ఇస్తారు రెమ్యునరేషన్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ కీలక పాత్రల్లో సముద్రఖని దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్రో’. ఇందులో నటుడు, కమెడియన్ పృథ్వీ.. శ్యాంబాబు పాత్రలో తళుక్కున మెరిశారు. అంతే, సినిమా విడుదలైన దగ్గరి నుంచి శ్యాంబాబు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. తనను కించపరిచేందుకే ఆ పాత్ర పెట్టారంటూ స్వయానా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. అయితే, చిత్ర బృందం ఎక్కడా ఆ పాత్ర అంబటి రాంబాబుది అని చెప్పకపోవడం గమనార్హం. అక్కడి నుంచి మొదలైన చర్చ, తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల కార్యక్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు, వాటికి ఏపీ మంత్రులు, వైకాపా నాయకుల కౌంటర్‌తో మరింత పెరిగి పెద్దదైంది.