కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు రాజులా బతికిన వాడు కాలం కలిసి రాకపోతే బిచ్చగాడుగా మారుతాడు. ఇది ఏ రంగంలోనైనా సరే. సినిమా రంగం కూడా ఇందులోకే వస్తుంది. ఒకప్పుడు స్టార్ పొజిషన్లో ఉన్న ఆర్టిస్టులు కూడా ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అయితే అందుకు కారణం ఇండస్ట్రీలో ఉన్న దోపిడీ వ్యవస్థ అంటూ చాలామంది ఆరోపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి నటీనటుల్లో కమెడియన్ పాకీజా కూడా ఒకరు. ఆమె అసలు పేరు వాసుకి. ఈ తరం ప్రేక్షకులకు పాకీజా అంటే తెలియకపోవచ్చు. కానీ 90ల్లో లేడీ కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి బాగా పాపులర్ అయింది.
మోహన్ బాబు హీరోగా నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్ర అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. దీంతో ఆమె వాసుకీ కాస్తా పాకీజాగా మారిపోయింది. తెలుగు కంటే తమిళంలోనే ఆమె ఎక్కువ సినిమాల్లో చేసింది. తన కెరీర్లో ఇప్పటివరకు దాదాపుగా 250 కి పైగా చిత్రాలలో నటించింది. ఇన్ని చిత్రాల్లో నటించిన ఆమెకు ప్రస్తుతం తినేందుకు తిండి కూడా లేదు. తాను షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం. వైద్యానికి డబ్బులు లేక ఒక యూట్యూబర్ ఆమె దీనస్థితిని తెలుసుకుని వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆమెకు టాలీవుడ్ నుంచి కొంత సహాయం కూడా అందించినట్లు తెలుస్తోంది. తన సొంత పరిశ్రమ కోలీవుడ్ అసలు ఆమెను పట్టించుకోలేకపోతోంది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు పాకీజాకు ‘మా’ కార్డు కూడా ఇప్పించారు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా ఆర్థిక సహాయం అందించారిని తెలిసింది. తన పరిస్థితి బాగా లేకపోవడంతో భిక్షటన చేస్తూ తిరుపతిలో కనిపించినట్లు సమాచారం. అక్కడ దుకాణాల ముందు ఆమె బిక్షటన చేస్తూ ఉండగా కొంతమంది గుర్తించారు. అలా మళ్లీ ఈమె వెలుగులోకి వచ్చింది.