Kalki 2898 AD : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ ముందుకు దూసుకుపోతుంది. మొదటి రోజు సుమారుగా 195 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా, రెండవ రోజు, మూడవ రోజు కూడా అదే తరహా జోరుని కనబర్చింది. కేవలం మూడు రోజుల్లోనే 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం నాల్గవ రోజు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి అద్భుతాలను నెలకొల్పింది. బుక్ మై షో టికెట్ బుకింగ్ పోర్టల్ యాప్ లో ఈ సినిమాకి గంటకి లక్ష టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్స్ లో కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఏ సినిమాకి జరగలేదు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రానికి గంటలో 86 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్డు. ఇప్పుడు ఆ రికార్డుని కల్కి చిత్రం భారీ మార్జిన్ తో అధిగమించింది. కల్కి మరియు జవాన్ చిత్రాల తర్వాత గంటకి 82 వేల టిక్కెట్ల అమ్మకం తో తమిళ హీరో విజయ్ ‘లియో’ చిత్రం మూడవ స్థానం లో కొనసాగుతుండగా, ‘ఎనిమల్’ చిత్రం 80 వేల టిక్కెట్ల అమ్మకం తో నాల్గవ స్థానం లో కొనసాగుతుంది.
వీటి తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రానికి అప్పట్లో గంటకి 70 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయేవి. ఇదంతా పక్కన పెడితే కల్కి చిత్రానికి ఈ రేంజ్ ట్రెండ్ ఉండడానికి కారణం తెలుగు ఆడియన్స్ తో పాటుగా, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు సమానమైన ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ తరహా ట్రెండ్ నడుస్తుంది. మళ్ళీ అన్నీ భాషల్లో ఈ స్థాయి ట్రెండ్ ని కనబర్చే సినిమా ఏదైనా ఉందా అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2‘ మాత్రమే. ఆగస్టు 15 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, షూటింగ్ పనులు చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో డిసెంబర్ 6 వ తేదికి వాయిదా పడింది.