Jamuna : తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తన నటనతో చెరగని ముద్ర వేసింది టాలీవుడ్ సీనియర్ నటి జమున ఇకలేరు.. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో వివిధ పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.. నేడు హైదరాబాద్ లోని తన నివాసంలో జమున తుది శ్వాస విడిచారు.. సినీ ఇండస్ట్రీని శోక సంద్రంలో మంచి వెళ్ళిపోయారు.. ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ కు జమున పార్థివదేహాన్ని తీసుకురానున్నారు. జమున గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..
1936 ఆగస్టు 30న హంపిలో జమున జన్మించారు. జమున కుటుంబ సభ్యులు గుంటూరు వలస వెళ్లడంతో ఆమె బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాల లో గడిచింది. జమున అసలు పేరు జానాబాయి.. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలని జమున గా పేరు పెట్టారు. జమున కు ముందు నుంచి నాటకాలు వేయడం ఇష్టం.
ఆ మక్కువే ఆమెను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాయి.. 1953లో పుట్టిల్లు సినిమాతో జమున తెలుగు తెరకు పరిచయమయ్యారు.. ఆ తరువాత టాలీవుడ్ దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య తదితర సరసన హీరోయిన్ గా నటించారు.. జమున తెలుగులో 150 పైకి సినిమాలలో నటించారు. శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో జమున వేసిన పాత్ర ఆమెను నేటికీ సత్యభామగానే అందరి మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి సంసారపు రాణీ మాలినీదేవిగా, కలెక్టర్ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు.. మరే ఇతర హీరోయిన్స్ ఆ పాత్రలు పోషించనలేరు అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు.. కాగా ఆమె పై అప్పట్లో బాయ్ కాట్ ట్రెండ్ నడించింది. అయినా జమున నటనకు అవేమీ అడ్డు రాలేదు.
మిస్సమ్మ సినిమాతో జమునకు మంచి గుర్తింపు వచ్చింది.. మిస్సమ్మ, చిరంజీవిలు, భూకైలాస్, గుండమ్మ కథ, భాగ్యరేఖ , తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప వంటి సినిమాలు జమునాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జమున తెలుగు తోపాటు కన్నడ , తమిళ , హిందీ సినిమాల్లో నటించారు. 1964 లో నటించిన మూగమనసులు, 1968 హిందీ మిలన్ గౌరీ పాత్రకు ఉత్తమ సహాయ నటి అవార్డులు వచ్చాయి. 2008 లో యన్ టి ఆర్ జాతీయ పురస్కారం అందుకుంది.
జమున సినిమాలలోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించారు. దివంగత ఇందిరాగాంధీ పట్ల అభిమానం గౌరవంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు . 1980 లో ఆమె కాంగ్రెస్ పార్టీ లో చేరారు .1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి రాజమండ్రీ నుంచి లోక్ సభ ఎంపీగా విజయం సాధించారు. 1991 లో ఓటమి చెందడంతో ఆమె రాజకీయాలకు దూరం అయ్యారు.