Hyper Aadi : తన మార్క్ కామెడీ పంచులతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు బుల్లి తెర టాప్ కమెడీయన్ గా ఎదిగారు. సుధీర్, గెటప్ శ్రీను తర్వాత అంతటి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి హైపర్ ఆది. బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే జనాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. బుల్లి తెరపై షోస్ చేస్తూనే సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతుగా స్టార్ క్యాంపెయినర్ గా ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఏపీలో అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం.
సినీ ఇండస్ట్రీలో కమెడియన్‌గా స్టార్ డమ్ దక్కించుకున్న.. హైపర్ ఆది కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ఇటీవల ఆది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాను ఇండస్ట్రీకి రావడానికి తాను చాలా శ్రమించానంటూ చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకన్నానని చెప్పాడు. దీంతో అవకాశాల కోసం తిరుగుతున్నాడట. అప్పుడే ఆదికి ఒక ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్తే అక్కడ రూ.3000 కట్టమన్నారంట. మరోమారు ఆలోచించకుండా అడిగినంత డబ్బు అక్కడ కట్టి తన ఫోన్ నంబర్ ఇచ్చి తిరిగి వచ్చేశాడట.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతగానో ఎదురుచూస్తున్న ఆది.. తర్వాత రోజు ఎంతో ఉత్సాహంతో ఆ ప్రొడక్షన్ ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించలేదట. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురైన ఆది చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేయడగా అక్కడ అసలు ఎటువంటి ప్రొడక్షన్ సంబంధించిన వారు లేరని తెలుసుకున్నాడు. ఆది నుంచి డబ్బులు తీసుకున్న వారికి ఆ ప్రొడక్షన్ హౌస్‌కి సంబంధం లేదని తర్వాత తెలిసిందంట. ఈ క్రమంలోనే తాను మోసపోయానని గ్రహించాడట. ఈ క్రమంలోనే అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఎవరికి డబ్బులు ఇవ్వద్దంటూ ఆది సూచించాడు.